
- రైతులతో 48 గంటల్లో పైసలు ఇప్పిస్త
- సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి సవాల్
- మీకు ఫాంహౌస్‌లు ఉండాలె.. పేదలకు భూములు ఉండొద్దా?
హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ రైతుల నుంచి అగ్గువకు భూములు గుంజుకొని కార్పొరేట్ కంపెనీలకు కోట్లకు అమ్ముకోవాలని చూస్తున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ఫాంహౌస్‌లోని వెయ్యి ఎకరాల భూమిని పేద రైతులకు ఎకరానికి రూ.25 లక్షల లెక్కన అమ్ముతావా? అని సవాల్ చేశారు. ఫాంహౌస్‌లోని భూములు అమ్మడానికి రెడీ అయితే.. 48 గంటల్లోనే రైతులతో పైసలు ఇప్పిస్తానన్నారు. కేసీఆర్‌కు, ఆయన ఫ్యామిలీకి వేల ఎకరాల భూములు, ఫాంహౌస్‌లు ఉంటాయి గానీ.. పేద రైతులకు భూములు ఉండొద్దా అని నిలదీశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు, సాఫ్ట్‌వేర్ కంపెనీలు వచ్చి ఈ ప్రాంతం డెవలప్ అయిందని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడు కేసీఆర్ కన్ను యాచారం, కడ్తాల్, కందుకూరు భూములపై పడిందని ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలో రేవంత్ ప్రారంభించిన రాజీవ్ రైతు భరోసా పాదయాత్ర.. మంగళవారం తుక్కుగూడలో ముగిసింది. పది రోజుల పాటు 129.5 కిలోమీటర్ల దూరం ఈ యాత్ర సాగింది. ఈ సందర్భంగా రావిర్యాలలో ములుగు ఎమ్మెల్యే సీతక్క అధ్యక్షతన రణభేరి సభ నిర్వహించారు. రేవంత్ తుక్కుగూడ నుంచి సభ ప్రాంగణం వరకు భారీ ట్రాక్టర్ ర్యాలీతో వచ్చారు. సాయంత్రం ఏడున్నర టైంలో స్టేజీపైకి చేరుకుని
ప్రసంగించారు.
కాంగ్రెస్‌కు ఆక్సిజన్ రేవంతే: కొండా సురేఖ
నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేపట్టినపుడు కూడా కాంగ్రెస్ హైకమాండ్ పర్మిషన్ లేదని.. నాటి యాత్రతో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని గుర్తుంచుకోవాలని పార్టీ సీనియర్ నేత కొండా సురేఖ అన్నారు. రేవంత్ పీసీసీ చీఫ్ అయినా, కాకపోయినా కాంగ్రెస్‌ను లీడ్ చేయగలరని.. రేవంత్ కాంగ్రెస్‌కు ఆక్సిజన్ అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినా పేద జనానికి న్యాయం జరగలేదన్నారు. కాంగ్రెస్ అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వణికిపోతున్నాయని మాజీ ఎంపీ మల్లు రవి అన్నారు. కేంద్ర అగ్రిచట్టాలు రద్దు చేయాలని, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అగ్రిచట్టాల విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచన చేయాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కోరారు. ‘రణభేరి’ సభలో సీనియర్ నేతలు సురేశ్షేట్కార్, బలరాం నాయక్, సిరిసిల్ల రాజయ్య, ఇందిరా శోభన్, కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, టి.రామ్మోహన్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, మల్‌రెడ్డి రంగారెడ్డి, వేం నరేందర్ రెడ్డి, ఇతర నేతలు హాజరయ్యారు.
ఉత్తమ్, భట్టి ఫొటోల్లేవ్!
రాజీవ్ రైతు భరోసా యాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన రణభేరి సభలో ఏర్పాటు చేసిన ఏ కటౌట్‌లో కూడా పీసీసీ చీఫ్ఉత్తమ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కల ఫొటోలు కనిపించలేదు. కేవలం స్టేజీపై ఏర్పాటు చేసిన ఫ్లెక్లీలో మాత్రం ఉత్తమ్ ఫొటో పెట్టారు.
రైతులను దోచుకుంటున్నరు
తన యాత్రకు పోలీసులు, రాష్ట్ర సర్కారు ఎన్ని ఇబ్బందులు సృష్టించినా.. అడ్డుగోడల్ని బద్దలుకొట్టి రైతులకు సంఘీభావంగా యాత్ర చేశానని రేవంత్ చెప్పారు. తెలంగాణ నేలలో చైతన్యం, పట్టుదల, త్యాగం ఉన్నాయన్నారు. సీమాంధ్రులు ఈ నేలను చెరబడితే 1,200 మంది బిడ్డలు ఆత్మబలిదానాలు చేసి విముక్తం చేశారని గుర్తు చేశారు. అదే కేసీఆర్ మాత్రం మోడీతో జోడి కట్టి రాష్ట్ర రైతుల గొంతు కోస్తున్నారని ఆరోపించారు. కేంద్ర అగ్రి చట్టాలపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు పోరాడుతుంటే.. తాను ఎక్కడ వెనుకబడుతానో అని కేసీఆర్ భారత్ బంద్‌కు మద్దతిచ్చారని కామెంట్ చేశారు. ప్రధాని దగ్గర నాలుగు కోట్ల మంది ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు. కేంద్రం తెచ్చిన అగ్రి చట్టాలు రద్దయ్యే వరకు పోరాడుతామని చెప్పారు. ప్రజలంతా కోరుకుంటున్నట్టుగా త్వరలోనే తెలంగాణ అంతటా పాదయాత్ర చేస్తానని, సీఎం కేసీఆర్‌ను వంద అడుగుల గోతిలో కప్పెడతానని పేర్కొన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర పర్మిషన్ తీసుకుని ఉప్పెన సృష్టిస్తానని.. కేసీఆర్ సర్కారును గద్దె దించుతానని చెప్పారు.
నిరుద్యోగ భృతి ఏది?: చిన్నారెడ్డి
రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా సీఎం కేసీఆర్ పట్టించుకోవడమే లేదని మాజీ మంత్రి జి.చిన్నారెడ్డి మండిపడ్డారు. నిరుద్యోగ యువతకు భృతి ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని విమర్శించారు. తాను ఎమ్మెల్సీగా గెలవగానే ఉద్యోగాలు, నిరుద్యోగ భృతిపై ఆమరణ దీక్ష చేపడతా నని ప్రకటించారు. కేంద్రం తెచ్చిన అగ్రిచట్టాలతో రైతులకు నష్టమన్నారు.
కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే: షబ్బీర్‌అలీ
సీఎం కేసీఆర్ రైతుల కోసం నిలబడతానంటూ భారత్ బంద్‌లో పాల్గొన్నారని, కానీ జైల్లో పెడతామని బీజేపీ బెదిరించడంతో వారికి మోకరిల్లారని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ కామెంట్ చేశారు. కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలేనని, ఆయనో పిట్టల దొరలా తయారయ్యారని పేర్కొన్నారు.