ఐదేండ్లలో ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యం 20 బిలియన్ డాలర్లు: ప్రధాని మోదీ
లూలా దూరదృష్టితో ఇరుదేశాలు ఎంతో లబ్ధిపొందాయి
న్యూఢిల్లీ: వచ్చే ఐదేండ్లలో బ్రెజిల్–భారత్ మధ్య వాణిజ్యం 20 బిలియన్ డాలర్లకు మించి విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇరు దేశాలది విన్ విన్ పార్ట్‌నర్ షిప్ అని పేర్కొన్నారు. భారత్ పర్యటనలో ఉన్న బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వాతో ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీ శనివారం ద్వైపాక్షిక చర్చలు జరిపారు. కీలక ఖనిజాలు, భద్రతా అంశాలతోపాటు అన్ని రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు.
అనంతరం లూలాతో కలిసి ప్రధాని మోదీ మీడియా సమావేశంలో మాట్లాడారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూలా దూరదృష్టి, స్ఫూర్తిదాయకమైన నాయకత్వంలో భారత్-–బ్రెజిల్ సంబంధాలు ఎంతో లబ్ధి పొందాయని పేర్కొన్నారు. ఆయన భారత పర్యటన చరిత్రాత్మకమైన ఏఐ సమిట్ వైభవాన్ని పెంచడమే కాకుండా..ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త శక్తిని ఇచ్చిందని పేర్కొన్నారు.
విపత్తు తట్టుకోగల మౌలిక సదుపాయాల కూటమి (సీడీఆర్‌ఐ)లో చేరాలన్న బ్రెజిల్ ప్రతిపాదనను మోదీ ఆహ్వానించారు. బ్రెజిల్‌కు సరసమైన ధరకే నాణ్యమైన మందులను సరఫరా చేస్తామని, ఆయుర్వేదం, సంప్రదాయ వైద్య విధానాలను కూడా అక్కడ విస్తరిస్తామని హామీ ఇచ్చారు.
లాటిన్ అమెరికాలోనే అతిపెద్ద భాగస్వామి..
భారత్‌కు లాటిన్ అమెరికాలోనే బ్రెజిల్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని ప్రధాని మోదీ తెలిపారు. ‘‘మా వాణిజ్యం కేవలం అంకెలకు సంబంధించింది కాదు, అది మా మధ్య ఉన్న నమ్మకానికి ప్రతిబింబం. లూలాతో వచ్చిన వ్యాపార ప్రతినిధుల బృందమే ఇందుకు నిదర్శనం” అని పేర్కొన్నారు.
భారత్-–మెర్కోసూర్ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్(పీటీఏ) విస్తరణ ద్వారా ఆర్థిక సహకారం మరింత బలపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. సాంకేతికత, ఆవిష్కరణల రంగంలో సహకారం కేవలం రెండు దేశాలకే కాకుండా మొత్తం ‘గ్లోబల్ సౌత్’కు కీలకమని ప్రధాని తెలిపారు. బ్రెజిల్‌లో ‘డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు.
ఏఐ, సూపర్ కంప్యూటర్లు, సెమీ కండక్టర్లు, బ్లాక్‌చైన్‌లాంటి రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. అధ్యక్షుడు లూలా పర్యటన ఇరు దేశాల మధ్య కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందని పేర్కొన్నారు.
