దేవాలయాల దగ్గర వైన్​షాపులు… రోడ్ల పక్కనే సిట్టింగులు

దేవాలయాల దగ్గర వైన్​షాపులు… రోడ్ల పక్కనే సిట్టింగులు

జంట నగరాల్లో ఎక్కడపడితే అక్కడ ఏర్పాటు చేసిన వైన్‌ షాపులు, బార్లు సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. మద్యం కొనుగోలు చేసిన వారు దుకాణాల పక్కన, రహదారులపై తాగుతూ వచ్చీపోయేవారితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. వైన్‌ షాపుల నిర్వహణలో యజమానులు నిబంధనలు పాటించకపోవడంతో ఇట్లా జరుగుతోంది. సిటీలో చాలాచోట్ల దేవాలయాలకు దగ్గర్లోనే మద్యం షాపులున్నాయి. కూకట్‌పల్లి భాగ్యనగర్‌ కాలనీలో సాయిబాబా గుడికి 30 మీటర్ల దూరంలో,  మూసాపేటలో అమ్మవారి ఆలయం ఎదురుగా దుకాణాలున్నాయి. సాయంత్రం కాగానే మద్యం కొనుగోలు కోసం వచ్చి గుంపులు గుంపులుగా  నిలబడుతూ జనాలకు ఇబ్బందిగా మారుతున్నారు. ఎర్రగడ్డ, చింతల్‌ బస్తీ, సికింద్రాబాద్‌, ఉప్పల్‌, ఎల్బీనగర్‌, బోరబండ, మెహిదీపట్నం, చింతల్‌ బస్తీ, అత్తాపూర్‌, సనత్‌నగర్‌, శివరాంపల్లి తదితర ప్రాంతాల్లో కూడా ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని పలువురు చెబుతున్నారు. మూసాపేటలో గుడి ఎదురుగానే ఉన్న వైన్స్‌ ఉండడంతో దేవాలయానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.

మైనర్లకూ మద్యం అమ్ముతున్నరు

మైనర్లకు మద్యం అమ్మొద్దని రూల్స్​ఉన్నప్పటికీ కొంతమంది దర్జాగా అమ్ముతున్నారు. దుకాణాల వద్ద పేరుకు మాత్రమే బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు కానీ నిబంధనలు పాటించడం లేదు. సాయంత్రం నుంచి అర్ధరాత్రి దాకా మద్యం షాపుల దగ్గర జాతర సాగినట్లే కనిపిస్తోంది. ఆ దారిలో వెళ్లాలంటేనే మహిళలు జంకుతున్నారు. పీకల దాకా తాగిన వారు ఇంటికి వెళ్లలేక రహదారుల పక్కన పడిపోతున్నారు. జంట నగరాల్లోని చాలా వైన్‌ షాపుల వద్ద ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. నిబంధనలు పాటించని మద్యం షాపులు, బార్ల యజమానులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.