16 ఏండ్ల బాలికతో క్షుద్రపూజలు?

16 ఏండ్ల బాలికతో క్షుద్రపూజలు?

మూడు రోజుల నుంచి మిస్సింగ్​

మేనమామ ఇంట్లో 20 ఫీట్ల గుంత తవ్వి పూజలు

మహారాష్ట్ర వెళతానని చెప్పిందంటున్న  ఫ్రెండ్​

17, 18 తేదీల్లో యువకుడికి ఫోన్​

ట్రేస్​చేసే పనిలో పోలీసులు

ఎర్రుపాలెం, వెలుగు: గుప్త నిధుల కోసం ఓ కుటుంబం క్షుద్రపూజలు నిర్వహిస్తుండడం, ఇంటర్ చదివే 16 ఏండ్ల మేనకోడలిని అందులో కూర్చోపెట్టడం, ఆమె కనిపించకుండా పోవడం పలు అనుమానాలకు కారణమైంది. 20 రోజులుగా ఇంట్లో 20 ఫీట్ల గుంత తవ్వి ఈ పూజలు నిర్వహిస్తుండడంతో ఏమైనా జరిగి ఉంటుందా అన్న కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా ఆ బాలిక మహారాష్ట్రలో చదువుకోవడానికి వెళతానని ఫ్రెండ్​కు చెప్పడంతో ఆ దిశగా కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. పోలీసులు, స్థానికులు, తల్లి ఫిర్యాదు ప్రకారం.. మధిర నియోజకవర్గ పరిధిలోని ఎర్రుపాలెం మండలం రేమిడిచర్ల గ్రామానికి చెందిన గద్దె నరసింహారావుకు ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని ఎవరో చెప్పగా బెంగుళూరుకు చెందిన రుద్ర దేవత పూజ నిర్వహించే ఓ వ్యక్తి సూచనలతో ఇంట్లో సుమారు 20 అడుగుల లోతు గుంత తవ్వించాడు. 20 రోజుల నుంచి తన మేనకోడలు(16)తో పూజలు చేయిస్తున్నాడు. బాలిక అనారోగ్యంతో ఉండడంతో బాగవుతుందని ఆమె తల్లి కూడా పూజలకు ఒప్పుకుంది. బుధవారం గుంటూరు జిల్లా పెద్దకాకానిలో ఒకరి అన్నప్రాసన ఉండడంతో తన అన్న అయిన నరసింహారావు అతడి కుటుంబసభ్యులతో కలిసి వెళ్తూ బాలికను ఇంట్లోనే వదిలి వెళ్లింది. అదే రోజు సాయంత్రం ఇంటికి రాగా కూతురు కనిపించలేదు. ఎక్కడా జాడ లేకపోవడంతో నరసింహారావు కుటుంబసభ్యులను అడిగింది. వారు ‘ మేము నీతో పాటే కదా ఊరికి వచ్చింది. మాకేం తెలుసు? ఎక్కడికి పోతుంది రెండు రోజుల్లో వస్తుందిలే’ అని  సమాధానమిచ్చారు. దీంతో సాయంత్రం వరకూ చూసి కూతురు రాకపోవడంతో ఎర్రుపాలెం పోలీసులకు కంప్లయింట్​ ఇచ్చింది.

పోలీసులను లోపలికి రానివ్వలే

విచారణలో భాగంగా ఎర్రుపాలెం ఏఎస్ఐ గోపాల్ శుక్రవారం రాత్రి రేమిడిచర్లకు చేరుకొని నరసింహారావు ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నించగా అతడితో పాటు కుటుంబసభ్యులు కూడా అడ్డుకున్నారు.  దీంతో లోపల ఏమైనా జరిగి ఉంటుందా అన్న అనుమానం కలిగింది. విషయాన్ని ఎస్ఐ ఉదయ్ కిరణ్ కు చెప్పడంతో సిబ్బందితో కలిసి అక్కడికి వచ్చారు. అందరూ కలిసి లోపలికి వెళ్లగా 20 అడుగుల గుంత కనిపించింది. ప్రశ్నించగా తమకు కలిసి రావడం లేదని గతంలో పూజలు చేశామని, అప్పుడు తవ్వామని చెప్పారు. మంచిరోజు చూసుకుని పూడుస్తామని చెప్పారు. బాలిక గురించి నరసింహారావును అడిగితే తెలియదని చెప్పారు. దీంతో నరసింహారావుతో పాటు అతడి కుటుంబసభ్యులను అదుపులోకి తీసుకొని పీఎస్​కు తరలించారు. శనివారం సీఐ మురళి రేమిడిచర్లలోని నరసింహారావు ఇంటికి వెళ్లి విచారణ జరిపారు. క్షుద్ర పూజలు జరిగింది నిజమేనని తేల్చారు.

మహారాష్ట్ర వెళతా..చదువుకుంటా

మిస్సింగ్​అయిన బాలిక ఫ్రెండ్​తో అప్పుడప్పుడు ‘మహారాష్ట్రలో ఒక ఆశ్రమం ఉంది అక్కడ చదువుకోవడానికి వెళతా’ అని చెప్పేదని సీఐ మురళి తెలిపారు.  17న కూడా ఆమె ఫ్రెండ్​ దగ్గర ఈ ప్రస్తావన తీసుకువచ్చిందని, చదువు పూర్తయిన తరువాతే వస్తానని మాట్లాడినట్టు తెలిసిందన్నారు. 17, 18 తేదీల్లో ఒక పర్సన్​తో ఫోన్​లో మాట్లాడిందని, ట్రేస్ ​చేయడానికి ప్రయత్నిస్తే స్విచ్ఛాఫ్​ వస్తోందన్నారు. క్షుద్రపూజలు చేస్తున్నారన్న భయంతో ఎక్కడికైనా వెళ్లిందా ? చదువుకోవడానికి వెళ్లిందా? ఇంకే మైనా జరిగి ఉంటుందా అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

For More News..

దండకారణ్యంలో ఓపెన్​ క్లబ్బులు.. అక్కడ కోడి పంచాంగం స్పెషల్

టార్గెట్లు సరే.. ఖాళీల సంగతేంది సార్లూ..

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలి