ఆర్టీసీ పొదుపు మంత్రం..డీజిల్ వినియోగం తగ్గించి మైలేజీ పెంపునకు డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ 

ఆర్టీసీ పొదుపు మంత్రం..డీజిల్ వినియోగం తగ్గించి మైలేజీ పెంపునకు డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ 

 

  •     డీజిల్ వినియోగం తగ్గించి మైలేజీ పెంపునకు డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ 
  •     వచ్చే ఆదాయంలో 30 శాతం ఖర్చు డీజిల్ పైనే
  •     ఇందుకోసం రూ. 200 కోట్లపైనే ఖర్చు

హైదరాబాద్, వెలుగు: ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సంక్షోభం, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతుండడంతో దీన్ని ఆదా చేయడంపై తెలంగాణ ఆర్టీసీ దృష్టిపెట్టింది. ఆర్టీసీకి వచ్చే మొత్తం ఆదాయంలో ఏకంగా 30 శాతం డీజిల్ కే ఖర్చు అవుతుండడం యాజమాన్యాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో డీజిల్ ఖర్చులు తగ్గించకుంటే సంస్థ మనుగడ ఇబ్బందుల్లో పడనుందని గుర్తించిన యాజమాన్యం నెల రోజులుగా పొదుపు మంత్రంపై సీరియస్  చర్యలు ప్రారంభించింది. బస్సులకు డీజిల్ ఖర్చు తగ్గించి మైలేజీ పెంచడంపై డ్రైవర్లకు యాజమాన్యం సాంకేతిక పరమైన శిక్షణను ఇప్పిస్తుంది. జాతీయ స్థాయిలో పేరొందిన ఓ ఆయిల్ కంపెనీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సాంకేతిక నిపుణులతో విడతల వారీగా డ్రైవర్లకు శిక్షణ ఇప్పిస్తున్నారు.

డీజిల్ ఖర్చును తగ్గించి మైలేజీ పెంచే డ్రైవర్లకు ప్రోత్సాహకాలను యాజమాన్యం ప్రకటించింది. డిపోల వారిగా డీజిల్ వాడకం ఎక్కువగా ఉన్న  బస్సులపై ప్రత్యేక దృష్టిపెట్టి, వాటిలో ఉన్న సాంకేతిక లోపాలను సవరించడంపై యాజమాన్యం డిపో మేనేజర్లను అప్రమత్తం చేసింది. ఇదే సమయంలో డ్రైవర్లు బస్సు నడిపే సమయంలో మైలేజీ పెంచేందుకు డ్రైవింగ్ చేస్తున్న తీరును  నిశితంగా గమనిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 10 వేల 130 బస్సులు ఉండగా, ఇందులో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు పోగా మిగిలిన 9 వేల పైచిలుకు బస్సులు ప్రతి రోజు 35 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్నాయి. నిత్యం 60 లక్షలకు పైగా ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. ఇందుకోసం ప్రతి రోజు సుమారు 7 లక్షల లీటర్ల డీజిల్ ఖర్చు అవుతోంది. ఈ లెక్కన నెలకు ఆర్టీసీ సంస్థకు 2 కోట్ల లీటర్ల డీజిల్ ఖర్చు అవుతోంది. ఇప్పుడు మార్కెట్లో డీజిల్ ధర ప్రకారం ప్రతి నెలా ఆర్టీసీకి రూ. 200 కోట్ల పైనే ఖర్చు అవుతోంది. ఈ లెక్కన ఆర్టీసీకి వచ్చే ఆదాయంలో డీజిల్ ఖర్చు ఏకంగా 30 శాతం ఉంది. ఇంతటి భారాన్ని తగ్గించుకునేందుకు ఆర్టీసీ వేగవంతమైన చర్యలను చేపట్టింది. ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం పెరిగినా.. రానున్న రోజుల్లో డీజిల్ బస్సులను అనుకున్న స్థాయిలో పక్కన పెట్టే అవకాశం ఉండదని యాజమాన్యం గుర్తించింది. అందుకే డీజిల్ పొదుపుపైనే ఆర్టీసీ యాజమాన్యం సాంకేతికంగా దృష్టిపెట్టింది.