
ప్రాణహిత పరవళ్లు
మేడిగడ్డకు తొలిసారిగా లక్ష క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో
36 గేట్లు ఓపెన్, 1.19 లక్షల క్యూసెక్కులు నీళ్లు కిందకు..
కన్నెపల్లి నుంచి ఐదు మోటార్లతోనే వాటర్ లిఫ్టింగ్
మహారాష్ట్రలో వర్షాలతో వరద పెరిగే అవకాశం
కృష్ణా బేసిన్లో ఆల్మట్టికీ వరద తాకిడి
జయశంకర్ భూపాలపల్లి/ మహదేవపూర్/ హైదరాబాద్, వెలుగు : మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత పరవళ్లు తొక్కుతున్నది. బుధవారం లక్షా 23 వేల క్యుసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్లు ఇరిగేషన్ ఆఫీసర్లు తెలిపారు. మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేసే పరిస్థితులు లేకపోవడంతో 36 గేట్లు తెరిచి 1.19 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. ప్రాణహితలో ఇన్‌ఫ్లో పెరిగినా సర్కారు మాత్రం వాటర్ లిఫ్టింగ్ సామర్థ్యం పెంచడం లేదు.
40 వేల నుంచి లక్షా 23 వేల క్యూసెక్కులు
ప్రాణహితలో మంగళవారం 40వేల క్యూసెక్కుల వరద రావడంతో మేడిగడ్డ బ్యారేజీ 12 గేట్లు తెరిచి నీళ్లను దిగువకు వదిలారు. బుధవారం ఉదయం 6 గంటలకు వరద 80 వేల క్యూసెక్కులకు పెరిగింది. దీంతో 24 గేట్లు తెరిచారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో వరద ఉధృతి లక్షా 23 వేల క్యూసెక్కులకు చేరుకోవడంతో మరో 12 గేట్లు తెరిచి మొత్తంగా 36 గేట్ల ద్వారా వరదనీటినంతా కిందకు వదులుతున్నారు. మొత్తం బ్యారేజీకి 85 గేట్లు ఉండగా ప్రస్తుతం 36 గేట్లు తెరిచి ఉంచారు. సాయంత్రం వరకు ప్రాణహిత ఇన్‌ఫ్లోలో మార్పేమీ లేదని అధికారులు వెల్లడించారు.
కృష్ణా బేసిన్లో ఆల్మట్టికి మొదలైన వరద
కృష్ణా బేసిన్లో ఆల్మట్టి ప్రాజెక్టుకు వరద మొద లైంది. మహాబలేశ్వరం ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో ఈ ప్రాజెక్టుకు 19 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఈ రిజర్వాయర్‌లో 129.72 టీఎంసీలకు 21.08 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. తుంగభద్రకు వరద కొనసాగుతోంది. 17 వేల క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో వస్తున్నది. 100.86 టీఎంసీలకు గాను 6.89 టీఎంసీలే నిల్వ ఉన్నాయి. మిగతా ప్రాజెక్టులకు పెద్దగా ఇన్‌ఫ్లోలు లేవు.
తగ్గిన వాటర్ లిఫ్టింగ్
మేడిగడ్డ బ్యారేజీకి ఓ వైపు వరద ఉధృతి పెరుగుతుంటే సర్కారు మాత్రం అన్నారం బ్యారేజీకి వాటర్ లిఫ్టింగ్ తగ్గిస్తూ పోతున్నది. వారం రోజులుగా ఉదయం ఏడు, రాత్రి రెండు మోటార్ల ద్వారా నీళ్లను లిఫ్ట్ చేస్తూ వచ్చారు. కానీ బుధవారం మాత్రం ఉదయం ఐదు మోటార్ల ద్వారానే వాటర్‌ను లిఫ్ట్ చేశారు. రోజుకు 10 వేల క్యూసెక్కులలోపే వాటర్ లిఫ్టింగ్ జరుగుతున్నది. మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీ వద్ద బుధవారం 99.10 మీటర్ల హైట్ తో 13.36 టీఎంసీల వాటర్ నిల్వ ఉంది. ఎగువనుంచి 1.23 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. అయినా ఆఫీసర్లు వాటర్ లిఫ్ట్ చేసే మోటార్ల సంఖ్యను ఎందుకు తగ్గించారో తెలియడం లేదు. అన్నారం (సరస్వతీ) పంపు హౌస్ నుంచి సుందిళ్ల బ్యారేజీకి 6,937 క్యూసెక్కుల వాటర్ మాత్రమే లిఫ్ట్ చేస్తున్నారు. అన్నారం బ్యారేజీ కెపాసిటీ 10.87 టీఎంసీలు కాగా బుధవారం 117.73 మీటర్ల హైట్ తో 8.02 టీఎంసీల నీటి నిల్వ ఉందని అధికారులు వెల్లడించారు. ఈ బ్యారేజీకి కన్నెపల్లి పంప్‌హౌజ్ నుంచి లిఫ్ట్ చేస్తున్న వాటర్ మినహా బయటి నుంచి ఎలాంటి ఇన్‌ఫ్లో లేదు.