- కొత్త అలైన్మెంట్తో మహారాష్ట్రకు నష్టం జరగదంటున్న అధికారులు
- 150 మీటర్ల ఎత్తుతో కట్టినా సమస్య ఉండదనే అంచనా
- చాప్రాల వన్యప్రాణి సంరక్షణ కేంద్రమూ సేఫ్
- అటవీ భూములూ మునగవ్.. పర్యావరణ అనుమతులూ ఈజీ
- ముంపు లేకుంటే మహారాష్ట్ర ఒప్పుకుంటుందన్న ఆశాభావం
హైదరాబాద్, వెలుగు: ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా నిర్మించతలపెట్టిన తుమ్మిడిహెట్టి బ్యారేజీకి గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం అడ్డు చెప్పిన సంగతి తెలిసిందే. ముంపు ఎక్కువగా ఉంటుందని, ప్రధానంగా చాప్రాల వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ముంపునకు గురవుతుందని అభ్యంతరం చెప్తూ వస్తోంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న కొత్త అలైన్మెంట్తో ముంపు చాలావరకు తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి గతంలో 150 మీటర్ల ఎత్తుతో పాత అలైన్మెంట్తో నిర్మిస్తే మహారాష్ట్ర వైపు దాదాపు 1,500 ఎకరాల దాకా మునుగుతుందని అధికారులు తేల్చారు. అందులో కేవలం 11 ఎకరాల అటవీ భూమి ఉందని నిర్ధారించారు. దానికి తగ్గట్టు పరిహారం ఇచ్చేందుకూ సిద్ధమయ్యారు. కానీ, మహారాష్ట్ర ఒప్పుకోకపోవడంతో 148 మీటర్లకు ఒప్పందం కుదుర్చుకున్నారు.
దాని వల్ల ముంపు ప్రభావం 270 ఎకరాలకు తగ్గింది. కానీ, ఎత్తు తగ్గించుకోవడం వల్ల నీటి లభ్యత చాలా తక్కువగా ఉంటుందనే కారణంతో రాష్ట్ర సర్కారు వెనక్కి తగ్గింది. మేడిగడ్డ కుంగిపోవడంతో తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ తుమ్మిడిహెట్టిని నిర్మించాలని భావిస్తోంది. అందులో భాగంగానే మహారాష్ట్రను ఒప్పించేలా కొత్త అలైన్మెంట్తో ముందుకొచ్చింది.
ముంపుపై సమగ్ర సర్వే..
గతంలో ఉన్న అలైన్‌మెంట్‌కు కొంత భిన్నంగా రెండు బ్యారేజీలను నిర్మించి.. ఆ రెండింటిని కనెక్ట్ చేసేలా ఒక కాంక్రీట్ బండ్‌ను నాన్ ఓవర్ ఫ్లో (ఎన్వోఎఫ్) సెక్షన్లా నిర్మించాలని ఇప్పటికే ప్రతిపాదించారు. ఆ రెండు బ్యారేజీల్లో వైన్గంగపై నిర్మించే బ్యారేజీని గతంలో ప్రతిపాదించిన ప్రాంతం నుంచి కొంచెం దూరంగా కట్టనున్నారు. డిజైన్ మార్చడం, బ్యారేజ్సైట్ను కొంచెం వెనక్కి తీసుకుపోవడం వంటి కారణాలతో.. బ్యారేజీని 150 మీటర్ల ఎత్తుతో నిర్మించినా ముంపు ఎక్కువగా ఉండదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మహారాష్ట్ర వైపు ముంపు ఉండకూడదని, దానికి తగ్గట్టుగానే అలైన్‌మెంట్‌ను ఫిక్స్ చేయాలని అధికారులను ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్‌మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. దీంతో అందుకు అనుగుణంగానే ఈ అలైన్‌మెంట్‌ను ఖరారు చేసినట్టు చెబుతున్నారు. గతంలో చాప్రాల వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ముంపు పరిధిలో ఉండగా, కొత్త అలైన్మెంట్తో ఇప్పుడు ఏ మాత్రం ఎఫెక్ట్ కాదని చెబుతున్నారు. మహారాష్ట్రలో ముంపు కూడా ఉండదని, అటవీ భూములు సైతం మునగవంటున్నారు. బ్యారేజీలు నిర్మించే ప్రాంతాల్లో పాండేజ్ (బ్యాక్‌వాటర్) ఏర్పడి కేవలం క్యాచ్మెంట్ ఏరియానే ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది తప్ప ఇంకేం ఉండదని చెప్తున్నారు. వైన్‌గంగ, వార్ధా నదుల బఫర్లైన్లకూ ఎలాంటి ముప్పు ఉండదంటున్నారు. దీనిపై ఇప్పటికే ఆర్వీ అసోసియేట్స్, ఐఐటీలు కలిసి జాయింట్సర్వే చేస్తున్నాయి. ఆ సర్వేతో ముంపుపై మరింత క్లారిటీ వస్తుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
అనుమతులు సులభంగానే..
ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు కూడా సులువుగానే వస్తాయని చెబుతున్నారు. ఇప్పటికే 148 మీటర్ల ఎత్తుతో బ్యారేజీని నిర్మించేందుకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సులు కూడా వచ్చాయి. పర్యావరణానికి నష్టం ఉండదని కేంద్రమూ నిర్ధారించింది. ఇప్పుడు కొత్త అలైన్మెంట్తో ముంపు సమస్య ఏమీ ఉండదు కాబట్టి.. పర్యావరణ అనుమతులు సులభంగానే వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. సర్వే సంస్థల నివేదికల ఆధారంగా సెంట్రల్ వాటర్ కమిషన్‌తో టెక్నికల్ క్లియరెన్సులు తెచ్చుకుంటే.. వాటి ఆధారంగా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకూ వీలవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్ర అభ్యంతరం చెబుతున్నది ముంపుపైనే కాబట్టి.. ఆ సమస్యే ఉత్పన్నం కానప్పుడు ఆ రాష్ట్రం కూడా బ్యారేజీ నిర్మాణానికి ఒప్పుకుంటుందని ప్రభుత్వ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. రెండు రాష్ట్రాల సీఎంల చర్చల్లో వచ్చే ఫలితంపైనే అది ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.
