ఆసిఫాబాద్, వెలుగు: అధిక లాభాలు వస్తాయని అమాయకులకు ఆశ చూపించి భారీ మొత్తంలో నగదు వసూలు చేసి మోసగించిన ముఠాలోని ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ నితికా పంత్ వివరాలు వెల్లడించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో డివైన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ పేరిట నకిలీ వ్యాపారం నిర్వహిస్తూ మోసం చేసిన కేసులో ఠాకూర్ శివరంజనిబాయిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
నిందితులు పథకం ప్రకారం 5 శాతం నుంచి 20 శాతం వరకు లాభాలు వస్తాయని చెప్పి బాధితులను నమ్మించారని చెప్పారు. ఈ కేసులో హైదరాబాద్ లాలాగూడ, కాగజ్ నగర్ టౌన్, పెంచికల్ పేట్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ఐదుగురు నిందితులు ఉండగా, శివరంజని బాయిని అరెస్ట్ చేశామని, ఠాకూర్ కరణ్ సింగ్, ఠాకూర్ రతన్ సింగ్, ఠాకూర్ రవీందర్ అలియాస్ లడ్డూ సింగ్, ఠాకూర్ రాణా సింగ్ పరారీలో ఉన్నారని చెప్పారు. కాగజ్ నగర్ డీఎస్పీ వహిదుద్దీన్, కాగజ్ నగర్ టౌన్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్, ఎస్సై రాజును ఎస్పీ అభినందించారు.

