బస్సు కండక్టర్ పై దాడి.. మహిళపై కేసు నమోదు

బస్సు కండక్టర్ పై దాడి.. మహిళపై కేసు నమోదు

హయత్‌నగర్ డిపో-1కు చెందిన కండక్టర్ పై ఓ మహిళా ప్రయాణికురాలు నానా దుర్భషలాడుతూ.. కొడుతూ.. కాలుతో తన్ని దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బస్సులో ఉన్న తోటి మహిళా ప్రయాణికులు ఎంత వారించినా సదరు మహిళ పట్టించుకోకుండా కండక్టర్ పై దాడికి పాల్పడింది. ఈ  ఘటనను టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై రాచకొండ కమిషనరేట్‌ ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలిపారు.  

 మొదటి ట్రిప్పుని తన దగ్గర చిల్లర లేదని కండక్టర్‌ విన్నవించినా.. సదరు మహిళా ఏమాత్రం వినకుండా దాడికి పాల్పడింది. నిబద్దతతో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తోన్న సిబ్బందిపై ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఏమాత్రం ఉపేక్షించబోమని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. టీఎస్ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటకం కలిగించే, దాడులకు దిగే వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని సజ్జనార్ హెచ్చరించారు. టీఎస్‌ఆర్టీసీ సిబ్బంది చాలా ఓపిక, సహనంతో విధులు నిర్వహిస్తున్నారని... వారికి సహకరించి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రజలకు సంస్థ విజ్ఞప్తి చేస్తోందని ఆయన తెలిపారు.