కుత్బుల్లాపూర్: ఇంటిని విక్రయిస్తానని నమ్మించి ఓ వ్యక్తి వద్ద నుంచి రూ.31.77 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకుని మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఎర్రోళ్ల రేణుక అనే మహిళపై జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. కుత్బుల్లాపూర్ తహశీల్దార్ (MRO) కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగినిగా చెప్పుకుంటూ అనధికారికంగా పనిచేస్తున్నట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి.
రూ.80 లక్షలకు ఇంటి విక్రయ ఒప్పందం
పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం.. జగద్గిరిగుట్ట పరిధిలోని మైసమ్మ నగర్‌లో 60 చదరపు గజాల స్థలంలో నిర్మించిన జీ+2 భవనాన్ని రూ.80 లక్షలకు విక్రయిస్తానని రేణుక బాధితుడితో ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో బాధితుడి నుంచి రూ.31,77,000 అడ్వాన్స్‌గా తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.అడ్వాన్స్ డబ్బులు తీసుకున్న అనంతరం అదే ఇంటిని ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో తనఖా పెట్టి మరో రూ.34 లక్షల రుణం పొందినట్లు బాధితుడు ఆరోపించారు. ఇంటి రిజిస్ట్రేషన్ చేయకుండా కాలయాపన చేయడంతో పాటు, తాను చెల్లించిన అడ్వాన్స్ డబ్బుల గురించి ప్రశ్నించినప్పుడు దుర్భాషలాడి, అంతు చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదులో వెల్లడించారు.
బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జగద్గిరిగుట్ట పోలీసులు ఎర్రోళ్ల రేణుకపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 316(2), 318(4) కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
