భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదని మన పెద్దలు చెబుతుంటారు. చాలామంది దీనిని ఒక పాతకాలపు నమ్మకంగా కొట్టిపారేస్తుంటారు. కానీ, దీని వెనుక నిజంగానే శాస్త్రీయ, ఆయుర్వేద కారణాలు ఉన్నాయి. మీకు కూడా రాత్రిపుట ఆలస్యంగా భోజనం చేయడం, వెంటనే స్నానం చేసి పడుకునే అలవాటు ఉంటే... ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
స్నానం చేసినప్పుడు
మనం సాధారణంగా వేడి నీటితో స్నానం చేసినప్పుడు శరీర ఉష్ణోగ్రత కాస్త పెరుగుతుంది. దీనిని శాస్త్రీయంగా 'హైపర్‌థెర్మిక్ యాక్షన్' (Hyperthermic Action) అంటారు. సాధారణ సమయంలో వేడి నీటి స్నానం శరీరానికి చాలా మంచిది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది, నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది ఇంకా శరీరంలో ఉన్న వ్యర్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది.
తిన్న వెంటనే స్నానం చేస్తే
మనం భోజనం చేసిన వెంటనే జీర్ణక్రియ (Digestion) కోసం కడుపు భాగానికి ఎక్కువ రక్తం సరఫరా కావాల్సి ఉంటుంది. అయితే అదే సమయంలో స్నానం చేయడం వల్ల, శరీరం ఉష్ణోగ్రతను బ్యాలెన్స్ చేయడానికి రక్తాన్ని చర్మం, ఇతర భాగాల వైపు మళ్లిస్తుంది. దీనివల్ల గుండె వేగం పెరగడం, కడుపులో అసౌకర్యం, ఉబ్బరం లేదా జీర్ణక్రియ నెమ్మదించడం వంటి సమస్యలు వస్తాయి.
ఆయుర్వేదం ఏం చెబుతోంది?
ఆయుర్వేదం ప్రకారం మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి 'జాఠరాగ్ని' (Digestive Fire) చాలా అవసరం. తిన్న వెంటనే నీరు చర్మంపై పడటం వల్ల ఆ జీర్ణ అగ్ని చల్లబడిపోతుంది. జీర్ణక్రియకు ఉపయోగపడాల్సిన శక్తి ఇతర అవయవాలకు మళ్లిపోవడం వల్ల తిన్న ఆహారం సరిగ్గా అరగక గ్యాస్, ఎసిడిటీ సమస్యలు తలెత్తుతాయి.
భోజనం చేసిన తర్వాత
జీర్ణక్రియ సరిగ్గా జరగడానికి, ఆరోగ్యంగా ఉండటానికి తిన్న తర్వాత ఈ తప్పులు చేయకండి:
*భోజనం చేసిన వెంటనే నోటిలో యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. దానివల్ల దంతాల పైపొర (ఎనామెల్) సున్నితంగా మారుతుంది. ఆ సమయంలో బ్రష్ చేస్తే పళ్ళు దెబ్బతింటాయి. తిన్న తర్వాత కనీసం 30 నిమిషాల విరామం ఇవ్వాలి.
* తిన్న వెంటనే పడుకోవడం వల్ల యాసిడ్ రీఫ్లక్స్ (కడుపులోని యాసిడ్ పైకి రావడం) అయ్యే ప్రమాదం ఉంది. భోజనానికి, నిద్రకు మధ్య కనీసం 1 గంట విరామం ఉండాలి.
*తిన్న వెంటనే వర్కౌట్లు లేదా వ్యాయామం చేయడం వల్ల కడుపు నొప్పి, వాంతులు అయ్యే అవకాశం ఉంది.
తిన్న వెంటనే స్నానం చేయడానికి బదులుగా, స్నానం చేసిన తర్వాత ప్రశాంతంగా భోజనం చేయడం అత్యంత ఆరోగ్యకరమైన అలవాటు !
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారంతో పండితుల సలహాలను వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
