తెలుగు నెలల్లో ఏడవ నెల ఆశ్వయుజమాసం. పండితులు తెలిపిన వివరాల ప్రకారం .. ఈ నెల చాలా శక్తివంతమైనది. ఆధ్యాత్మికత.. ప్రకృతి సౌందర్యం.. ఆధ్యాత్మికత.. అనేక ఆచారాలతో పాటు దేవీ నవరాత్రి ఉత్సవాలు.. విజయదశమి..దీపావళి.. ఇంకా అనేకమైనవి ఉన్నాయి. ఆశ్వయుజమాసం శక్తి ఆరాధనకు చాలా ముఖ్యమైనది.
తెలుగు సంవత్సరాల ప్రకారం ఆశ్వయుజ మాసం శక్తి మాసమని పండితులు చెబుతున్నారు. ఈ నెలలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు.. తిరుమల బ్రహ్మోత్సవాలతో పాటు అనేక విశేషాలు ఉంటాయి.
ఆశ్వయుజ మాసంతో శరదృతువు ప్రారంభమవుతుంది. ఖగోళ శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం ఈ రుతువులో చంద్రుడు భూమికి దగ్గరగా ఉంటాడు. అందుకే వెన్నల వెలుగులు విరాజిల్లుతాయి. వాతావరణం..చల్లగా, ప్రకాశవంతంగా ఉంటుంది. ఆకాశంలో మేఘాలు దూది పింజల్లా కనిపిస్తాయి. ప్రకృతి మొత్తం పచ్చదనంతో నిండి ఉంటుంది. అందమైన, ఆహ్లాదకరమైన ఈ రుతువులో వచ్చే శరన్నవరాత్రులు ఆధ్యాత్మిక సంస్కతిలో ఎంతో ప్రత్యేకమైనవి.
స్త్రీ పురుష రూపాత్మకం కాలం
పురాణాల ప్రకారం ఆశ్వయుజమాసాన్ని.. స్త్రీ పురుష రూపాత్మక కాలం అంటారు. అంటే తెలుగు సంవత్సరంలో మొదటి ఆరు మాసాలు ( చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాడం, శ్రావణం, భాద్రపదం ) పురుష రూపాత్మకం అని అంటారు. తరువాత వచ్చే ఆరుమాసాలు (ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం) స్త్రీ రూపాంతకం అని పండితులు చెబుతున్నారు. స్త్రీ రూపాంతక నెల ఆశ్వయుజంతో ప్రారంభమవుతుంది. అందుకే ఆశ్వయుజమాసంలో అమ్మవారి ఆరాధనకు చాలా విశిష్టత ఉంది.
శక్తి మాసం
ఆశ్వయుజ మాసంలో పౌర్ణమి రోజు చంద్రుడు అశ్విని నక్షత్రంతో కలిసి ఉండడం వల్ల ఈ మాసానికి “ఆశ్వయుజ మాసం” అని పేరు వచ్చింది. శక్తి ఆరాధనకు ప్రధానమైన మాసం. అందుకే ఈ నెలను ‘శక్తి మాసం’ అని కూడా పిలుస్తారు. ఇక ఈ మాసంలో వచ్చే మరిన్ని విశేషాలు కూడా ఉన్నాయి.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు
కలియుగ దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ మాసంలోనే అత్యంత వైభవంగా జరుగుతాయి.
శరన్నవరాత్రులు
ఆశ్వయుజ మాసం ప్రారంభమైన పాడ్యమి తిథి నుంచి నవమి( అక్టోబర్ 12 నుంచి 20) వరకు తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని, శక్తి స్వరూపిణిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని పూజిస్తే సంవత్సరమంతా పూజించిన ఫలితం దక్కుతుందనిభక్తులు నమ్ముతారు. అందుకే విజయదశమి రోజున జమ్మి చెట్టుకు పూజ చేస్తారు.
తెలంగాణాలో బతుకమ్మ సంబరాలు కూడా ఆశ్వయుజమాసంలోనే జరుగుతాయి. నవరాత్రుల్లో వచ్చే మూలా నక్షత్రం రోజు చేసే సరస్వతి దేవి పూజతో విద్య, వాక్పటుత్వం, జ్ఞానసిద్ధి కలుగుతుంది. దేవి నవరాత్రులలో బాల పూజ, కుమారి పూజ , సువాసిని పూజ విశేషంగా చేస్తారు.
ఒకేరోజు మూడు విశేషాలు
దుర్గాష్టమి రోజు దుర్గాదేవి ఆరాధన, సద్దుల బతుకమ్మ పండుగ విశేషంగా చేస్తారు. ఈ రోజు దుర్గాదేవిని మహాదుర్గగా ఆరాధిస్తారు. ఇదే రోజు తులా సంక్రమణం కూడా కావడం చాలా విశేషమని పండితులు చెబుతున్నారు.
మహర్నవమి
నవరాత్రులలో తొమ్మిదో రోజు మహర్నవమి పర్వదినం ఈ రోజు దుర్గాదేవి మహిషాసుర మర్థినిగా దర్శనమిస్తుంది.
విజయదశమి
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయ దశమి నాడు దసరా పండుగను జరుపుకుంటారు. ఈ రోజు జమ్మి చెట్టును పూజించడం, శమీ వృక్షానికి ప్రదక్షిణ చేయడం, బంధుమిత్రులు ఒకరికొకరు జమ్మి ఆకులు ఇచ్చి పుచ్చుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. విద్యారంభానికి, నూతన కార్యాలు మొదలు పెట్టడానికి విజయదశమికి మించిన శుభదినం మరోటి ఉండదు. ఈ రోజు ఏ పని ప్రారంభించినా విజయం సిద్ధిస్తుంది.
అట్ల తద్ది
వివాహితలు, యువతులు తమ సౌభాగ్యం కోసం, ఆరోగ్యం కోసం ఆశ్వయుజ మాసంలో ఆచరించే పరమ పవిత్రమైన నోము అట్ల తద్ది.
కోజాగిరి పౌర్ణమి (లక్ష్మీ పూజ)
ఆశ్వయుజ పౌర్ణమి నాడు క్షీరసాగర మథనంలో మహాలక్ష్మి ఉద్భవించిందని నమ్ముతారు. ఈ రోజు రాత్రి లక్ష్మీదేవిని పూజించి, ఆ చంద్రుని వెన్నెల వెలుగులో నైవేద్యం సమర్పిస్తారు.
దీపావళి
ఆశ్వయుజ మాస చివరి రోజైన అమావాస్య నాడు లోకమంతా చీకట్లను పారద్రోలుతూ దీపావళి పండుగను జరుపుకుంటారు. ఇక ఇవి మాత్రమే కాకుండా ఏకాదశి పర్వదినాలు, కృష్ణ పక్షంలో వచ్చే చతుర్థి రోజు సంకష్టహర చతుర్థి, త్రయోదశి రోజు జరుపుకునే ధన త్రయోదశి, చతుర్దశి రోజు జరుపుకునే నరక చతుర్దశి, మాస శివరాత్రి విశిష్టమైన పర్వదినాలు. పవిత్రమైన ఆశ్వయుజ మాసంలో రానున్న పర్వదినాలు ఉంటాయి.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
