మటన్ కత్తితో ప్రియుడి గొంతుకోసి హత్య..శవాన్ని సంచిలో మూటకడుతుండగా ఇంటి ఓనర్ రాక

 మటన్ కత్తితో  ప్రియుడి గొంతుకోసి హత్య..శవాన్ని సంచిలో మూటకడుతుండగా ఇంటి ఓనర్ రాక
  • కొడుకుతో కలిసి మహిళ కిరాతకం
  • శవాన్ని సంచిలో మూటకడుతుండగా ఇంటి ఓనర్​ రాక
  • పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుల అరెస్ట్ 
  • హైదరాబాద్ జీడిమెట్లలో దారుణం 

జీడిమెట్ల, వెలుగు: మద్యానికి బానిసై వేధిస్తున్నాడనే కోపంతో ఓ మహిళ తన 16 ఏండ్ల కొడుకుతో కలిసి మటన్​కత్తితో ప్రియుడి గొంతు కోసి హత్య చేసింది. అనంతరం శవాన్ని సంచిలో మూటకట్టి మాయం చేసేందుకు ప్రయత్నించారు. అంతలోనే ఇంటి ఓనర్ రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ జీడిమెట్ల పరిధి చింతల్‌‌లో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఏపీలోని అన్నమయ్య జిల్లాకు చెందిన శివారెడ్డి, గార్లపల్లి అరుణ (44) పది నెలలుగా చింతల్‌‌లోని చెరుకుపల్లి కాలనీలో సహజీవనం చేస్తున్నారు. అరుణకు 16 ఏండ్ల కొడుకు ఉన్నాడు.  అయితే శివారెడ్డి రోజూ తాగొచ్చి అరుణను, ఆమె కొడుకును కొడుతూ వేధించేవాడు. 

ఆదివారం అర్ధరాత్రి కూడా ఇదే విషయమై గొడవ జరగడంతో, వేధింపులు భరించలేక తల్లి, కొడుకు కలిసి సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మటన్ కొట్టే కత్తితో శివారెడ్డి గొంతుకోసి చంపేశారు. హత్య చేసిన తర్వాత ఆనవాళ్లు లేకుండా చేసేందుకు ఇంట్లోని రక్తపు మరకలను తుడిచేశారు. శివారెడ్డి శవాన్ని ఒక సంచిలో మూటకట్టి ఎక్కడైనా పడేయడానికి సిద్ధమవుతుండగా ప్లాన్ బెడిసికొట్టింది. గదిలోంచి వచ్చిన కేకలు విన్న చుట్టుపక్కల వారు ఇంటి యజమాని కృష్ణకు సమాచారం అందించారు. యజమాని అక్కడికి చేరుకుని తలుపు తట్టాడు. గదిలో రక్తపు మరకలతో మూటకట్టి ఉన్న సంచిని విప్పి చూడడంతో శివారెడ్డి మృతదేహం ఉంది. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అరెస్ట్ ​చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.