ఇన్వెస్ట్ మెంట్ పేరిట రూ. 11.19 లక్షలు కొట్టేశారు

ఇన్వెస్ట్ మెంట్ పేరిట రూ. 11.19 లక్షలు కొట్టేశారు

బషీర్ బాగ్, వెలుగు:   స్టాక్ మార్కెట్ లో ఓ మహిళతో ఇన్వెస్ట్ మెంట్ చేయించి సైబర్ క్రిమినల్స్ మోసగించారు.  సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ శివ మారుతి తెలిపిన ప్రకారం.. సిటీకి చెందిన 49 ఏళ్ల గృహిణికి సైబర్ క్రిమినల్స్  స్టాక్ మార్కెట్ పై ఇంట్రెస్ట్ ఉందా.. అంటూ వాట్సాప్ మెసేజ్ పంపించారు. ఆమె ఇంట్రెస్ట్ చూపగా ది వాన్ గార్డ్ గ్రూప్ ఇన్వెస్ట్ మెంట్ క్లబ్ వాట్సాప్ గ్రూప్ లో ఆమె ను జాయిన్ చేశారు. వారు సూచించినట్టు VGTOP యాప్ ను బాధితురాలు డౌన్ లోడ్ చేసుకుని తొలుత కొంత నగదు ఇన్వెస్ట్ చేసింది. లాభాలు రావడంతో నమ్మి ఆపై భారీగా ఇన్వెస్ట్ చేసింది. 

ఆమెకు లాభాలు ఇవ్వకుండా మరింత ఇన్వెస్ట్ చేయాలని సైబర్ చీటర్స్ ఒత్తిడి చేశారు. లేదంటే కేసులు పెడతామని బెదిరించారు. భయాందోళనకు గురైన మహిళ తను ఇన్వెస్ట్ చేసిన రూ. 11.19 లక్షలను తిరిగి ఇవ్వాలని కోరింది. డబ్బులు చెల్లించాలంటే కంపెనీ పాలసీ మేరకు ఇన్వెస్ట్ మెంట్ చేసిన డబ్బులో 20 శాతం టీడీఏస్ గా ముందుగా చెల్లించాలని సైబర్ చీటర్స్ మళ్లీ ఒత్తిడి చేశారు. ఆ డబ్బు చెల్లించకపోతే ఇన్వెస్ట్ మెంట్ చేసిన డబ్బు మొత్తం చారిటీకి విరాళంగా ఇస్తామని ఆమెను బెదిరించారు. దీంతో  మోసపోయానని తెలుసుకుని బాధిత మహిళ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ  తెలిపారు.