వరకట్న వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య

వరకట్న వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య

అల్వాల్ పీఎస్ పరిధిలో ఉరేసుకున్న వివాహిత

సికింద్రాబాద్, వెలుగు: వరకట్న వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన అల్వాల్ పీఎస్ పరిధిలో జరిగింది. బుధవారం ఎస్సై వరప్రసాద్ కథనం ప్రకారం..కూకట్ పల్లికి చెందిన  ప్రత్యూష(32)కి అల్వాల్ కి చెందిన శశికాంత్ తో 2013లో పెళ్లైంది. ఈ దంపతులకు ఓ పాప, బాబు ఉన్నారు. పెళ్లి సమయంలో కట్నం కింద శశికాంత్ కి కిలో బంగారం, రూ.20లక్షల డబ్బు ఇచ్చారు. ఆ తర్వాత అదనపు కట్నం కింద ప్రత్యూష తండ్రి కిషన్ రావు రూ.50లక్షలను శశికాంత్ కి ఇచ్చాడు. పెళ్లయిన తర్వాత నుంచి శశికాంత్, ప్రత్యూష అల్వాల్ లోని న్యూ రెడ్డి ఎన్ క్లేవ్ శ్రీనివాస్ నగర్ లో ఉంటున్నారు. శశికాంత్ కొన్ని నెలలుగా మరోసారి అదనపు కట్నం కావాలని ప్రత్యూషను వేధిస్తున్నాడు. ఈ వేధింపులు తట్టుకోలేక ప్రత్యూష ఇంట్లో ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యులు గమనించి ఆమెను వెంటనే దగ్గరలోని బీబీఆర్ హాస్పటల్ కి తరలించారు. అప్పటికే ప్రత్యూష చనిపోయినట్టు డాక్టర్లు తెలిపారు. ఏడేళ్లుగా తనను అదనపు కట్నం కోసం భర్త వేధిస్తున్నాడంటూ ప్రత్యూష ఎన్నోసార్లు చెప్పిందని ఆమె తండ్రి కిషన్ రావు అన్నారు. అదనపు కట్నం ఇచ్చినప్పటికీ శశికాంత్..ప్రత్యూషను మరోసారి డబ్బుల కోసం వేధించాడన్నారు. ప్రత్యూష తండ్రి కంప్లయింట్ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వరప్రసాద్ చెప్పారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్ కి తరలించామన్నారు. భర్త శశికాంత్ పరారీలో ఉన్నాడని..అతడి కోసం గాలిస్తున్నామని తెలిపారు.