టికెట్​ ధరలు లక్షల్లో సౌలతులు గివా?..ఎయిరిండియా సేవలపై ఇన్​స్టాలో ఓ మహిళ ఫైర్​

టికెట్​ ధరలు లక్షల్లో సౌలతులు గివా?..ఎయిరిండియా సేవలపై ఇన్​స్టాలో ఓ మహిళ ఫైర్​

న్యూఢిల్లీ: ‘‘సీట్లు సక్కగ లేవు, లైట్లు పనిచేస్తలేవు.. ఆడియో, వీడియో లేదు.. ఎంటర్​టైన్​మెంట్​లేదు.. నాలుగున్నర లక్షలు ఖర్చు చేసి టికెట్ ​కొని ఫ్లైట్​ఎక్కితే.. కనీస సౌలత్​లు ఉండయా?” అంటూ.. ఓ మహిళ ఎయిరిండియా విమాన సర్వీసు సేవలపై ఇన్​స్టాలో పోస్ట్​ చేసిన వీడియో వైరల్​ అయింది. ఢిల్లీకి చెందిన కంటెంట్ ​క్రియేటర్ ​శ్రేయితి గార్గ్​ తన ఇద్దరు పిల్లలతో ఇటీవల ఢిల్లీ నుంచి టొరంటోకు ఎయిర్ ఇండియా విమానంలో వెళ్లింది. విమాన టిక్కెట్ కు భారీగా వసూలు చేశారు. కానీ అందులో కనీస సౌకర్యాలు లేవని, జర్నీ సమయంలో తన పిల్లలతో ఎంతో ఇబ్బంది పడ్డానని ఆమె పేర్కొన్నారు. 

‘‘ఎయిర్ ఇండియాకు రూ.4.5 లక్షలు చెల్లించిన తర్వాత మాకు అందిన సేవలు ఇవీ” అంటూ ఆమె.. తాను కూర్చున్న సీట్లు సరిగా లేవని, లైట్లు పనిచేయడం లేదని చూపే ప్రయత్నం చేశారు. ‘నేను ఢిల్లీ నుంచి టొరంటోకు ఎయిర్ ఇండియా విమానంలో నా ఇద్దరు పిల్లలతో జర్నీ చేస్తున్న. విరిగిన సీట్ల నుంచి ఎంటర్​టైన్​మెంట్​లేని వ్యవస్థ వరకు ఇక్కడ ఇక్కడ ఏదీ పని చేయడం లేదు. విరిగిన సీటు హ్యాండిల్ క్లిప్​తీయడం మర్చిపోయాను. సిస్టమ్ నుంచి అన్ని వైర్లు బయటకు రావడంతో నాబిడ్డను జాగ్రత్తగా కాపాడుకోవాల్సి వచ్చింది. కనీస సౌకర్యాలు లేకపోవడంపై సిబ్బందికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు” అని ఆమె 3 రోజుల కింద ఇన్​స్టాలో వీడియో పోస్ట్​ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.