ఇంజక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే మహిళ మృతి

ఇంజక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే మహిళ మృతి
  •     ప్రైవేటు క్లినిక్ ఎదుట  కుటుంబసభ్యుల ఆందోళన
  •     క్లినిక్​కు తాళం వేయించిన డీ​ఎంహెచ్​వో 

గచ్చిబౌలి, వెలుగు : జ్వరం, జలుబుతో బాధపడుతున్న ఓ మహిళ ట్రీట్​మెంట్​ కోసం స్థానికంగా ఉన్న క్లినిక్​కు వెళ్లగా.. ఇంజక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే చనిపోయింది. దీంతో  డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే ఆమె చనిపోయిందంటూ కుటుంబసభ్యులు క్లినిక్ ఎదుట ఆందోళన చేశారు. ఈ ఘటన చందానగర్ పీఎస్ పరిధిలో జరిగింది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..   మధ్యప్రదేశ్​కు చెందిన హీరాలాల్, కుసుమ్ (55) దంపతులు సిటీకి వలస వచ్చి చందానగర్​లో ఉంటున్నారు. ఓ కన్​స్ట్రక్షన్​ కంపెనీలో కూలీ పని చేస్తున్నారు. రెండ్రోజులుగా కుసుమ్ జ్వరం,  జలుబుతో 
బాధపడుతోంది. దీంతో హీరాలాల్ ఆమెను దగ్గరలోని శ్రీ సాయి క్లినిక్​కు తీసుకెళ్లాడు. కుసుమ్​ను పరీక్షించిన డాక్టర్ జ్వరం తగ్గేందుకు ఇంజక్షన్​ ఇచ్చాడు.

కొద్దిసేపటికే కుసుమ్​ క్లినిక్​లోనే ఒక్కసారిగా కుప్పకూలింది. డాక్టర్ పరిశీలించి ఆమె చనిపోయినట్లు చెప్పాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు డెడ్​బాడీతో  క్లినిక్​ ఎదుట ఆందోళన చేపట్టారు. పోలీసులు డెడ్ బాడీని  గాంధీ ఆసుపత్రికి తరలించారు.  హీరాలాల్ ఇచ్చిన కంప్లయింట్ మేరకు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. మహిళ మృతి విషయం తెలుసుకున్న రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్​వో వెంకటేశ్వర్లు   శ్రీసాయి క్లినిక్​కు తాళం వేయాల్సిందిగా డిప్యూటీ  డీఎంహెచ్​వో సృజనను ఆదేశించారు. ఈ ఘటనపై  సమగ్ర విచారణ చేపట్టి చర్యలు  తీసుకుంటామన్నారు.