పద్మారావునగర్,వెలుగు: శబరి ఎక్స్‌ప్రెస్ రైలులో విషం తాగి ఆత్మహత్యకు యత్నించిన మహిళ చికిత్స పొందుతూ చనిపోయింది. ఆమెతో పాటు విషం తాగిన వ్యక్తి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గులిబిందల నీలవేణి (36), శ్రీరామ్ శిరీష్ కుమార్ ఈ నెల 7న శబరి ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీలో విషపదార్థం తాగి అపస్మారక స్థితికి చేరుకున్నారు. వెంటనే వారిని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం నీలవేణి మృతి చెందింది. శిరీష్ కుమార్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, చికిత్స కొనసాగుతోందని డాక్టర్లు తెలిపారు.
విచారణలో వెలుగులోకి విషయాలు..
పోలీసుల విచారణలో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. నీలవేణికి భర్తతో పాటు ఇద్దరు కుమారులు (16, 18 ఏళ్లు) ఉన్నారు. అయితే కొంతకాలంగా ఆమె తన కుటుంబాన్ని వదిలి స్వగ్రామానికి చెందిన శిరీష్ కుమార్‌తో కలిసి కోయంబత్తూరులో ఉంటోంది. వీరి విషయం తెలుసుకున్న శిరీష్ కుమార్ భార్య ఇద్దరినీ హైదరాబాద్‌కు తీసుకొస్తుండగా రైలులో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. తమ పరిస్థితి, జరిగిన పరిణామాలతో మనస్తాపానికి గురై ఇద్దరూ విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు గుర్తించారు. నీలవేణి సోదరుడి ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
