- కండ్లలో కారం చల్లి..చీరతో ఉరేసి
- శంషాబాద్లో మహిళ హత్య
- డెడ్ బాడీపై పెట్రోల్ పోసి నిప్పు
- అప్పు ఎగ్గొట్టడంతో పాటు నగలు
- దోచుకునేందుకు ఘాతుకం
- నిందితురాలు షేక్ రిజ్వానా అరెస్టు
శంషాబాద్, వెలుగు: శంషాబాద్లో దారుణం జరిగింది. అప్పు ఇచ్చిన మహిళను.. ఆమె దగ్గర అప్పు తీసుకున్న మరో మహిళ కిరాతకంగా చంపింది. ఆపై డెడ్ బాడీని ఎవరూ గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి కాల్చేసింది. గుర్తు తెలియని మృతదేహం లభ్యం కావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. చనిపోయిన మహిళను, నిందితురాలిని గుర్తించారు. ఈ కేసు వివరాలను శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి మీడియాకు శనివారం వెల్లడించారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనివాస ఎన్ క్లేవ్ లో షేక్ రిజ్వానాఉంటున్నది.
ఆమె తన చెల్లెలి పెండ్లి కోసం అధిక వడ్డీకి అప్పులు తీసుకుంది. అప్పులు ఎక్కువ కావడం, అవి తిరిగి ఇవ్వాలని అప్పులోళ్లు అడగడంతో ఆమెపై ఒత్తిడి పెరిగింది. అయితే రిజ్వానాకు ఇంద్రనగర్ దొడ్డి గ్రామానికి చెందిన వడ్ల మంజుల(49)తో కొంతకాలం నుంచి పరిచయం ఉంది. ఈ క్రమంలోనే ఆమె దగ్గర కూడా అప్పు తీసుకుంది. గతంలో రూ.50 వేల అప్పు తీసుకోగా, ఇటీవల మరో రూ.50 వేలు తీసుకుంది. మొత్తం రూ.లక్షకు బాండ్ పేపర్ రాసిస్తానని చెప్పిన రిజ్వాన.. ఈ నెల 10న మంజులను తన ఇంటికి పిలిచింది.
ప్లాన్ ప్రకారం మర్డర్..
మంజుల ఇచ్చిన అప్పు ఎగ్గొట్టడంతో పాటు ఆమె దగ్గరున్న నగలు దోచుకోవాలని రిజ్వాన ముందే పథకం వేసుకుంది. అందుకోసం అన్నీ సిద్ధం చేసుకుంది. ఈ నెల 10న సాయంత్రం మంజుల తన ఇంటికి రాగానే ప్రేమతో పలకరించింది. అన్నం తినుమని చెప్పింది. ఏం కూర వండావని మంజుల అడగ్గా.. కోడిగుడ్డు వండానని రిజ్వాన చెప్పింది. తనకు బిర్యానీ కావాలని మంజుల అడిగింది. అయితే ఆ తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ముందు వేసుకున్న ప్లాన్ ప్రకారం.. మంజుల కండ్లలో రిజ్వాన కారం పొడి చల్లింది.
ఆ తర్వాత మంజుల చీరతోనే ఆమె మెడకు ఉరి బిగించి చంపింది. అనంతరం మంజుల ఒంటిపై ఉన్న మూడు తులాల బంగారు పుస్తెల తాడు, చెవి కమ్మలు తీసుకుంది. ఇంట్లోని తన మంచం కిందనే రాత్రి 11 గంటల వరకు డెడ్ బాడీని దాచిపెట్టింది. రాత్రి 11:30 ప్రాంతంలో శ్రీనివాస ఎన్ క్లేవ్ లో తాను ఉంటున్న మొదటి అంతస్తు నుంచి కింది వరకు మంజుల మృతదేహాన్ని ఈడ్చుకెళ్లింది. పక్కనే ఉన్న ఓపెన్ ప్లాట్ లో మృతదేహంపై పెట్రోల్ తో పోసి తగులబెట్టింది. అనంతరం కొత్తూరుకు పారిపోయింది. అక్కడే రూమ్ తీసుకుని తెల్లారె వరకు ఉన్నది. అక్కడ నగలు అమ్మి, ఆ డబ్బులు వేరే వాళ్లకు ఇచ్చింది. అనంతరం ఇంటికి చేరుకుంది.
తాళాల ఆధారంగా గుర్తింపు..
ఈ నెల 10న ఇంట్లో నుంచి వెళ్లిన మంజుల.. తిరిగి రాకపోవడంతో ఆమె భర్త శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీనివాస ఎన్ క్లేవ్ దగ్గర గుర్తు తెలియని మృతదేహం ఉందని సమాచారం రావడంతో అక్కడికి వెళ్లి పరిశీలించారు. అక్కడ దొరికిన తాళాలు, హాస్పిటల్ చిట్టీల ఆధారంగా ఆ డెడ్ బాడీ మంజులదేనని గుర్తించారు.
అనంతరం సీసీ ఫుటేజీలు, మంజుల కాల్ లిస్టు ఆధారంగా దర్యాప్తు చేపట్టి షేక్ రిజ్వానాను నిందితురాలిగా తేల్చారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా, చేసిన నేరం ఒప్పుకుంది. రిజ్వానాను రిమాండ్ కు తరలించామని డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. ఈ కేసును 24 గంటల్లోనే ఛేదించామని చెప్పారు.