
- స్కెచ్ వేసి పట్టుకున్న రాజస్థాన్ పోలీసులు
జైపూర్: ఉద్యోగం లేని సోదరుడు, తల్లిదండ్రులు లేని ఒంటరి యువతినని నమ్మించి పెండ్లి చేసుకుని.. ఆపై డబ్బు, నగలతో పరారవుతోంది ఓ నిత్య పెండ్లి కూతురు. అలా ఏడు నెలల్లోనే 25 పెండ్లిలు చేసుకుని యువకులను బురిడీ కొట్టించింది. తన అందం, తెలివితేటలతో ఒక్కొక్కరి నుంచి లక్షలాది రూపాయల క్యాష్, నగలతో ఉడాయించింది. తాను మోసపోయానంటూ 25వ పెండ్లికొడుకు ఫిర్యాదు చేయడంతో రాజస్థాన్ పోలీసులు దొంగ పెండ్లికొడుకు స్కెచ్ వేసి ఆ లూటేరీ దుల్హన్‌ను అరెస్ట్ చేశారు.
పెండ్లిల ముఠాతో చేతులు కలిపి దందా
ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌కు చెందిన 32 ఏండ్ల అనురాధ పాశ్వాన్.. గతంలో ఓ ఆస్పత్రిలో పనిచేసేది. గొడవల కారణంగా భర్తతో విడాకులు తీసుకుని మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు మకాం మార్చింది. అక్కడ పెండ్లిల రాకెట్ ముఠాతో చేతులు కలిపింది. వయసు పెరుగుతూ పెండ్లి సంబంధాలు కుదరని యువకులను ఈ ముఠా టార్గెట్ చేసుకుంది. పేదింటి అందమైన యువతి అంటూ అనురాధ ఫొటో చూపించి ముఠా సభ్యులు పెండ్లి కుదిర్చేవారు. అనంతరం చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో పెండ్లి జరిపేవారు. ఆపై అనురాధ అత్తవారింట్లో అమాయకంగా ఉంటూ వీలు చిక్కగానే నగలు, క్యాష్‌తో పరారయ్యేది. ఆపై మరో ప్రాంతానికి వెళ్లి కొత్త ఐడీలతో మరో పెండ్లి.. ఇలా 7 నెలల్లోనే 25 మందిని మోసం చేసింది.
నకిలీ పెండ్లి కొడుకుతోస్కెచ్ వేసి పట్టుకున్నరు..
అనురాధ పాశ్వాన్ చేతిలో మోసపోయానంటూ రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌కు చెందిన విష్ణుశర్మ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు ఆమెతో పెండ్లి కుదిర్చిన ఇద్దరు ఏజెంట్లకు రూ.2 లక్షలు ఇచ్చానని, గత ఏప్రిల్ 20న పెళ్లయిందని, మే 2న ఆమె పారిపోయిందని పేర్కొన్నారు. తమవాళ్లందరికీ భోజనంలో మత్తుమందు పెట్టి.. ఇంట్లో ఉన్న మొత్తం డబ్బు, నగలు, మొబైల్ ఫోన్లు కూడా పట్టుకెళ్లిందని వివరించారు. దీంతో రాజస్థాన్ పోలీసులు ఓ కానిస్టేబుల్‌నే పెండ్లి కొడుకులా నమ్మించి అనురాధను పట్టుకున్నారు.భోపాల్‌కు చెందిన ముఠా సభ్యుల కోసం గాలిస్తున్నారు.