ప్రియుడి డెడ్ బాడీని పెళ్లాడిన యువతి

ప్రియుడి డెడ్ బాడీని పెళ్లాడిన యువతి
  • మహారాష్ట్రలో పరువు హత్య..
  • కూతురు ప్రియుడిని చంపిన తండ్రి

నాందేడ్: మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఇటీవల జరిగిన పరువు హత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించడంతో యువతి కుటుంబ సభ్యులు ప్రియుడిని దారుణంగా హత్య చేశారు. అయితే, ఆ యువతి అంత్యక్రియల సమయంలో మృతదేహాన్ని పెళ్లి చేసుకుంది. యువకుడి ఉంట్లోనే తాను ఉంటానని తెగేసి చెప్పింది. నాందేడ్‌‌‌‌‌‌‌‌ కు చెందిన అంచల్ కు తన సోదరుల ద్వారా సక్షం టేట్ పరిచయమయ్యాడు. తరచుగా ఇంటికి వస్తుండటంతో ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ జంట మూడేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. 

కులాలు వేరు కావడంతో  అంచల్ తండ్రి వీరి ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించాడు. యువకుడికి దూరంగా ఉండాలని హెచ్చరించాడు. అయినా, అంచల్ లెక్క చేయకుండా తన ప్రేమను కొనసాగించింది. ఈ జంట పెండ్లి చేసుకోవాలనుకుంటున్నారని యువతి తండ్రి, సోదరులకు తెలిసింది. దీంతో వారు ఆ యువకుడిని దారుణంగా హత్య చేశారు. విషయం తెలిసి అంచల్​ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. సక్షం అంత్యక్రియలు జరుగుతుండగా అతడి ఇంటికి చేరుకుంది. 

సక్షం మృతదేహాన్ని పెండ్లి చేసుకుంది. అతడికి భార్యగా జీవితాంతం అక్కడే నివసిస్తానని తెలిపింది. సక్షం మరణించినప్పటికీ తమ ప్రేమ గెలిచిందని, తన తండ్రి, సోదరులు ఓడిపోయారని అంచల్ పేర్కొంది. తన తండ్రి, సోదరుడిని ఉరితీయాలని డిమాండ్ చేసింది. ఈ హత్య కేసులో పోలీసులు ఆరుగురు నిందితులపై కేసులు నమోదు చేశారు.