
టీచర్ రిక్రూట్ మెంట్ స్కాం కేసులో అరెస్టయిన బెంగాల్ మాజీ మంత్రి పార్థా ఛటర్జీపై ఓ మహిళ కోపంతో చెప్పు విసిరింది. పార్థాను వైద్య పరీక్షల నిమిత్తం కలకత్తాలోని ఈఎస్ఐ ఆసుపత్రికి తీసుకొచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తన పేరు సుభ్ర ఘాడైగా చెప్పిన ఆ మహిళ... తనది దక్షిణ 24 పరగణాల జిల్లాలోని అమ్టాలా ప్రాంతమని తెలిపింది. ఈ నేపథ్యంలోనే పార్థాపైకి చెప్పు ఎందుకు విసిరావన్న మీడియా ప్రశ్నకు ఆమె తీవ్రంగా స్పందించింది. ఎంతో మంది పేద ప్రజల డబ్బును కొల్లగొట్టిన విషయం మీకు తెలియదా అంటూ విరుచుకుపడింది. అలాంటి వ్యక్తిని ఏసీ కార్లలో తిప్పుతున్నారన్న ఆమె.. అతని మెడకు తాడు కట్టి ఈడ్చుకెళ్లాలని తెలిపింది. ఆ చెప్పు అతడి తలకు తగిలితే ఎంతో సంతోషించేదాన్ననని ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్థా ఛటర్జీ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నాడు. ఇప్పుడేమో ఫ్లాట్లు కొంటూ ఎంజాయ్ చేస్తున్నడు. ఈ కోపం నా ఒక్కదానిదే కాదు.. లక్షల మంది బెంగాల్ ప్రజలది అంటూ తీవ్రంగా కోప్పడింది. ఈ ఘటన అనంతరం పార్థాను చుట్టుముట్టిన సిబ్బంది.. ఆయనను సురక్షితంగా అక్కడ్నుంచి తరలించారు.
2014 - 21 మధ్యకాలంలో పార్థా చటర్జీ విద్యాశాఖ మంత్రిగా ఉండగా.. ఉపాధ్యాయ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయన్న నేపథ్యంలో ఇటీవల ఆయన ఇంటిపై ఈడీ సోదాలు నిర్వహించింది. అనంతరం ఆయనతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా.. అందులో ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ, ఆయన వ్యక్తిగత కార్యదర్శి సుకాంతా ఆచార్య ఉన్నారు. ఈ కేసులో భాగంగానే అర్పిత నివాసంలో రూ.50 కోట్లకు పైగా నగదు, కిలోల కొద్దీ బంగారం, కొన్ని కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.