
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగం చేస్తున్నానని, ఐదెకరాల భూమి ఉందని చెప్పాడు.. పెళ్లయిన తర్వాత అవన్నీ అబద్ధాలని తేలడంతో నవ వధువు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన సూర్యాపేట పట్టణంలో ఆదివారం జరిగింది.
పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూర్(ఎస్) మండలం గట్టికల్ గ్రామానికి చెందిన సామ ఇంద్రారెడ్డి ప్రభుత్వ టీచర్. ఇద్దరు కూతుళ్లున్నారు. పెద్ద కూతురు మౌనిక(24) సీఏ పూర్తి చేసి మంచి వేతనంతో ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు చెందిన సాయికిరణ్‌రెడ్డికి ఇచ్చి ఈ నెల 15న సూర్యాపేటలో ఘనంగా వివాహం జరిపించారు. కట్నకానుకల కింద రూ. 10 లక్షల నగదు, సుమారు 35 తులాల బంగారం, 4 కేజీల వెండి అప్పజెప్పారు. వరుడు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడని, ఘట్‌కేసర్ దగ్గర 5 ఎకరాల భూమి ఉందని పెండ్లికి ముందు నమ్మించారు. అయితే తనకు జరిగిన మోసం, మెట్టినింటి వారి ప్రవర్తనపై తీవ్రంగా కలత చెందిన మౌనిక, తన పెళ్లి కార్డుపైనే సూసైడ్ నోట్ రాసి, ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.