
మహారాష్ట్రలో ఘోరం జరిగిపోయింది. కారు బ్రేక్ బదులుగా ఓ యువతి యాక్సిలరేటర్ తొక్కగా వెనుక ఉన్న 300 అడుగుల లోయలో పడి చనిపోయింది. ఎల్లోరా గుహలకు వెళ్లే మార్గంలో ఉన్న దత్ ధామ్ టెంపుల్ కొండపై ఈ ప్రమాదం జరిగింది. 23 ఏళ్ల శ్వేతా సుర్వాసే డ్రైవింగ్ తెలియనప్పటికీ కారు నడుపుతూ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేసింది. కారును ఆమె రివర్స్ చేస్తుండగా బ్రేకు బదులుగా యాక్సిలరేటర్ ను నొక్కింది.
దీంతో కొండపై నుంచి కారు పడిపోయి నుజ్జునుజ్జయింది. ఆమె స్నేహితుడు శివరాజ్ ములే రికార్డ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ప్రమాదంలో యువతి మరణించింది. లోయలో పడిన శ్వేత వద్దకు వెళ్లడానికి ఆమె స్నేహితులకు గంట సమయం పట్టింది. ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయింది. మహారాష్ట్రలో ఇప్పుడు ఇలాంటి కేసులు చాలా నమోదవుతున్నాయని, ఇకపై ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.