
ముంబై : పురుషులతో పాటు తమకూ సమానంగా ఉద్యోగ అవకాశాలు దక్కుతున్నాయని మహిళలు భావిస్తున్నారని తాజా సర్వే ఒక వెల్లడించింది. ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫారమ్ అప్నా డాట్ సీఓ రిపోర్ట్ ప్రకారం, ఇంటర్వ్యూ చేసిన 80 శాతం మంది మహిళా నిపుణులు తమ సహోద్యోగులతో సమానంగా కెరీర్ వృద్ధి అవకాశాలను సాధించామని చెప్పారు. మహిళలను సంస్థలు పురుషులతో సమానంగా చూస్తున్నట్టు తమ స్టడీలో తేలిందని పేర్కొంది.
ఈ ఏడాది జులైలో ప్రస్తుతం వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న 10 వేల మంది మహిళలతో నిర్వహించిన ఆన్‌లైన్ సర్వే ఆధారంగా ఈ రిపోర్ట్‌ను తయారు చేశారు. సర్వేలో పాల్గొన్న వారిలో 65 శాతం మంది మహిళలు తమ ప్రస్తుత ఆఫీసుల్లో అందరికీ సమాన వేతనాలు ఉన్నాయని చెప్పారు. లింగ సంబంధిత సమస్యల గురించి మాట్లాడేందుకు హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్‌లు లేదా ఉన్నతాధికారులను సంప్రదించడంలో ఇబ్బందులు ఎదురుకాలేదని 75 శాతం మంది రెస్పాండెంట్లు చెప్పారు. అయినప్పటికీ, సామాజిక అంశాలు, సమస్యలు తమ కెరీర్ నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నాయని 80 శాతం మంది రెస్పాండెంట్లు అంగీకరించారు.
ఇంటర్వ్యూ చేసిన మహిళల్లో దాదాపు 60 శాతం మంది తమ వృత్తుల్ల లింగ ఆధారిత వివక్షను ఎదుర్కొన్నామని చెప్పారు. తమ కెరీర్ ఎదుగుదలకు అవకాశాలు ఉన్నాయని 63 శాతం మంది మహిళలు చెప్పారు. 56 శాతం మంది రెస్పాండెంట్లు మాత్రం లింగ సంబంధిత అడ్డంకులను ఎదుర్కొన్నామని వెల్లడించారని అప్నా డాట్ సీఈఓ నిర్మిత్ పారిఖ్ పేర్కొన్నారు.