ఐసీజీలో మహిళలకు .. పర్మనెంట్ హోదా ఎందుకివ్వరు? : సుప్రీంకోర్టు

ఐసీజీలో మహిళలకు .. పర్మనెంట్ హోదా ఎందుకివ్వరు?  : సుప్రీంకోర్టు
  • అర్హులైన మహిళలకు హోదాఇవ్వాల్సిందేనన్న సుప్రీం కోర్టు
  • మీరు ఇస్తారా.. మమ్మల్ని ఇవ్వమంటారా? అంటూ కేంద్రానికి అల్టిమేటం
  • తదుపరి విచారణ వచ్చే నెల 1కి వాయిదా

న్యూఢిల్లీ: ఇండియన్  కోస్ట్  గార్డు(ఐసీజీ) లో అర్హులైన మహిళా షార్ట్  సర్వీస్  కమిషన్  ఆఫీసర్లకు పర్మనెంట్  కమిషన్  హోదా ఎందుకు ఇవ్వట్లేదని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రస్తుతం ఉన్న నిబంధనలపై స్పందించి అవసరమైన చర్యలు తీసుకోకపోతే తామే జోక్యం చేసుకుంటామని స్పష్టంచేసింది. మహిళా సిబ్బందికి పర్మనెంట్  కమిషన్  హోదా ఇవ్వకుండా అలా వదిలేయలేమని పేర్కొంది. అర్హులైన మహిళా షార్ట్  సర్వీస్  కమిషన్  ఆఫీసర్లకు పర్మనెంట్  కమిషన్  హోదా ఇవ్వాలని కోరుతూ ఓ మహిళా అధికారి వేసిన పిటిషన్ పై సీజేఐ​జస్టిస్ డీవై చంద్రచూడ్  విచారణ జరిపారు. కేంద్రం తరపున అటార్నీ జనరల్  ఆర్.వెంకటరమణి వాదనలు వినిపిస్తూ ఆర్మీ, నేవీ కన్నా కోస్ట్ గార్డ్  కాస్త భిన్నంగా పనిచేస్తుందన్నారు. మహిళలకు పర్మనెంట్  కమిషన్  హోదా ఇవ్వకుండా ఇలా సాకులు చెప్పవద్దని సీజే అన్నారు. ‘‘మీరు (కేంద్రం) చెప్పే వాటికి ఎలాంటి ఆధారాలు లేవు. మహిళలను అలా వదిలి వేయరాదు. ఈ కేసులో కౌంటర్  వేయండి” అని సీజే ఆదేశించారు. తదుపరి విచారణను వచ్చే నెల 1కి వాయిదా వేశారు. కాగా, మహిళా ఆఫీసర్లకు పర్మనెంట్  కమిషన్  హోదా ఇవ్వకపోవడంపై అంతకుముందు సీజే నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బెంచ్.. కేంద్రం, ఇండియన్  కోస్ట్ గార్డ్ పై తీవ్రంగా మండిపడింది. మహిళా అధికారులను న్యాయంగా చూసే విధానాలను రూపొందించాలని బెంచ్  సూచించింది.