- దంపతులకు మహిళా శిశు సంక్షేమ శాఖ విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: దివ్యాంగ పిల్లలను దత్తత తీసుకునేందుకు దంపతులెవరూ ముందుకు రావడం లేదని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. జనరల్ పిల్లలతోపాటు స్పెషల్ నీడ్స్ పిల్లలు కూడా అమ్మనాన్నల ప్రేమను కోరుకుంటారని.. వారిని వైకల్యం పేరుతో దూరం పెట్టకుండా దత్తత తీసుకొని వారి జీవితాల్లో వెలుగులు నింపాలని పిలుపునిచ్చారు.
సోమవారం హైదరాబాద్ యూసఫ్‌గూడలోని ఎంఎస్ఎంఈలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అడాప్షన్ పై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.ఏటా నవంబర్ నెలలో దత్తతపై అవగాహన కల్పించేందుకు ఒక ప్రత్యేక థీమ్ ను ఎంచుకుంటారు. ఇందులో భాగంగా ఈ ఏడాది ‘స్పెషల్ నీడ్ చిల్డ్రన్ అడాప్షన్’ అనే థీమ్ ను ఎంచుకున్నారు.
దత్తతకు రెడీగా 144 మంది దివ్యాంగ చిన్నారులు...
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ...రాష్ట్రంలోని శిశు గృహాల్లో ప్రస్తుతం 144 మంది స్పెషల్ నీడ్స్ పిల్లలు దత్తతకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వీరిలో 82 మంది హైదరాబాద్‌లోనే ఉన్నారని చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు మొత్తం 109 మంది పిల్లలను దత్తత ఇవ్వగా..కేవలం 31 మంది మాత్రమే స్పెషల్ నీడ్ పిల్లలు ఉన్నట్లు వెల్లడించారు. 2014–2025 మధ్య విదేశీ దంపతులు మన రాష్ట్రం నుంచి 370 మంది స్పెషల్ నీడ్స్ పిల్లలను దత్తత తీసుకెళ్లారని చెప్పారు.
అదే.. మన దేశంలోని దంపతులు 2,089 మంది సాధారణ పిల్లలను మాత్రమే తీసుకున్నారని వివరించారు. దివ్యాంగులను దత్తత తీసుకునేందుకు విదేశీయులు పోటీ పడుతుంటే మనవాళ్లు మాత్రం వెనకడుగు వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 34 వేల మంది దంపతులు కారా వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అయి వెయిటింగ్‌లో ఉన్నారని తెలిపారు. కానీ స్పెషల్ నీడ్స్ పిల్లలను దత్తత తీసుకునేందుకు దాదాపు ఎవరూ ముందుకు రాలేదన్నారు.
దివ్యాంగ పిల్లల విషయంలోనూ మన వాళ్లు మనసు మార్చుకోవాలని అధికారులు కోరారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాలల హక్కుల కమిషన్ చైర్మన్ సీతా దయాకర్ రెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, ఢిల్లీ నుంచి వచ్చిన కారా ప్రతినిధి సిరాజ్, అడాప్షన్ జేడీ మోతీ, అడ్మిన్ జేడీ అక్కేశ్వరరావు, హైదరాబాద్ డీసీపీవో శ్రీనివాస్, పీవో ఎన్ఐసీ విజయ్ కుమార్, పీవోఐసీ విజయభాస్కర్, ప్రొగ్రామ్ మేనేజర్ సునీత పాల్గొన్నారు.
