బంగారు గుండ్ల కోసం మహిళ హత్య.. అదృశ్యమైన మహిళ కేసును ఛేదించిన పోలీసులు

బంగారు గుండ్ల కోసం మహిళ హత్య.. అదృశ్యమైన మహిళ కేసును ఛేదించిన పోలీసులు

రాయికోడ్, వెలుగు: బంగారు గుండ్ల కోసం ఓ మహిళను కిరాతకంగా హత్య చేసి బావిలో పడేసిన ఘటన సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలో వెలుగుచూసింది. తొలుత మిస్సింగ్​ కేసుగా నమోదైన ఈ ఘటన, చివరికి హత్యగా తేలింది. సింగీతం గ్రామానికి చెందిన ఉప్పరి లలిత(53) ఈ నెల 17న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో, ఆమె కుమార్తె ఉప్పరి ప్రభావతి ఫిర్యాదు మేరకు 18న మిస్సింగ్​ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. 

ఈ నెల 20న గ్రామ శివారులోని శశికాంత్ పాటిల్ వ్యవసాయ పొలంలోని బావిలో లలిత మృతదేహం లభ్యమైంది. మృతదేహంపై గాయాలు ఉండటం, మెడలో బంగారు గుండ్లు కనిపించకపోవడంతో బంగారం కోసం హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానించారు. అదే గ్రామానికి చెందిన ముక్కని భాస్కర్ ఈ నెల 17 నుంచి గ్రామంలో కనిపించకపోవడంతో అతడిపై పోలీసులకు అనుమానం వచ్చింది. 

శుక్రవారం అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా, బంగారు గుండ్ల కోసం లలితను బావిలోకి తోసి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. బంగారు గుండ్ల దండ, మొబైల్ ఫోన్, టీవీఎస్ ఎక్సెల్ బైక్​స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్‌‌‌‌‌‌‌‌కు తరలించారు.