హైదరాబాద్ లో మరో సారి డ్రగ్స్ కలకలం సృష్టించాయి. విద్యార్థులు, ఎంపిక చేసిన కొంత మంది వ్యక్తులే టార్గెట్ గా డ్రగ్స్ దందా చేస్తున్న ఘానా దేశానికి చెందిన మహిళను హైదరాబాద్ ఆబ్కారీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గోవా కేంద్రంగా మాదకద్రవ్యాలు హైద్రాబాద్ లో విక్రయిస్తున్న ఘానా దేశస్తురాలైన గేనవివే అనే మహిళను ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. నిన్న సాయంత్రం 4గంటల ప్రాంతంలో సోమాజిగూడ లో కోకైన్ మాదక ద్రవ్యాలు అమ్ముతున్నారన్న సమాచారం మేరకు ఓ హోటల్ పై ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఓయో యాప్ ద్వారా సదరు మహిళ హోటల్ బుక్ చేసుకుంది.
తన దగ్గర ఉన్న మాదకద్రవ్యాలను నగరంలో సప్లై చెయ్యడానికి రెండు రోజులు ముందే రూమ్ బుక్ చేసుకుంది. నిబంధనల ప్రకారం సెర్చ్ చేసినప్పుడు ఈమె ఆ హోటల్ లో డ్రగ్స్ కలిగి ఉంది. 50 కోకెన్ 10 వాడేసిన మాదకద్రవ్యాలు ఆమె వద్ద దొరికాయి. వాటిని స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు ఆమె పాస్ పోర్ట్ ను సీజ్ చేశారు. ఆమె వద్ద నుండి నోకియా మొబైల్ స్వాధీనం చేసుకొని కాల్ డేటా ను పరిశీలిస్తున్నారు. గోవా కి చెందిన వ్యక్తి చెప్పటం తో ఇక్కడికి వచ్చి సప్లై చేస్తున్నట్లు వెల్లడించింది. ఆమె కాల్ డేటా ఆధారంగా ఎవరెవరికి సప్లై చేస్తుందో తెలుసుకుంటామని హైద్రాబాద్ ఆబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్ వివేకానందరెడ్డి అన్నారు.
