ఆరు నెలల పాపతో కలిసి.. ఆరవ ఫ్లోర్ నుంచి దూకిన సాఫ్ట్వేర్ ఎంప్లాయ్.. మియాపూర్ పీఎస్ పరిధిలో ఘటన

ఆరు నెలల పాపతో కలిసి.. ఆరవ ఫ్లోర్ నుంచి దూకిన సాఫ్ట్వేర్ ఎంప్లాయ్.. మియాపూర్ పీఎస్ పరిధిలో ఘటన
  •     తల్లి మృతి, ప్రాణాలతో బయటపడ్డ కూతురు

మియాపూర్, వెలుగు: మియాపూర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఆరు నెలల పాపతో కలిసి ఓ సాఫ్ట్​వేర్​ ఉద్యోగిని తాను ఉంటున్న అపార్ట్​మెంట్​ 6వ ఫ్లోర్​ నుంచి కిందకు దూకింది. తీవ్రగాయాలతో అమె అక్కడికక్కడే చనిపోగా, గోడపై ఉన్న ఫెన్సింగ్​కు డ్రెస్​ చిక్కుకొని పాప గాయాలతో బయటపడింది. మియాపూర్​ ఇన్స్​పెక్టర్​ శివకుమార్​ తెలిపిన వివరాల ప్రకారం.. 

మహారాష్ట్రలోని నాగ్​పూర్​కు చెందిన భూపేంద్ర సాహుకు మధ్యప్రదేశ్​ రాష్ట్రం బుద్గావ్​కు చెందిన ఈషా సాహు(37)తో 2015లో పెండ్లి జరిగింది. సాఫ్ట్​వేర్​ ఉద్యోగులుగా పని చేస్తూ ఎనిమిదేండ్లుగా వారు మియాపూర్​ మయూరినగర్​లోని లక్ష్మీ ప్రెస్టేజ్​ అపార్ట్​మెంట్​లో ఉంటున్నారు. ప్రస్తుతం ఈషా సాహు మెటర్నటీ సెలవులో ఉంది. 

శుక్రవారం మధ్యాహ్నం భర్త, పెద్ద కూతురు విధిని సరుకులు తీసుకురావాలని బయటకు పంపించింది. సాయంత్రం ఆరు నెలల కూతురు వాణితో కలిసి ఆరవ ఫ్లోర్​కు వెళ్లి పాపతో కలిసి కిందకు దూకింది. ఈషా సాహు  ఘటనా స్థలంలో చనిపోగా, అపార్ట్​మెంట్​ కాపౌండ్​ వాల్​ ఫెన్సింగ్​కు వాణి డ్రెస్​ చిక్కుకోవడంతో స్వల్ప గాయాలయ్యాయి. 

పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, ఈషా సాహు రాసిన సూసైడ్​ నోట్​ను స్వాధీనం చేసుకున్నారు. మృతురాలు ఆరు నెలలుగా డిప్రెషన్​లో ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.