
- 8 ఏండ్లలో 8 వేల మంది రైతుల ఆత్మహత్య: షర్మిల
- టీఆర్ఎస్ పాలనలో మహిళలకు రక్షణ లేదని ఫైర్
ముదిగొండ, వెలుగు: బంగారు తెలంగాణలో బతకడమే కష్టంగా మారిందని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని ముదిగొండ, వెంకటాపురం, మేడేపల్లి, కట్టకూరు గ్రామాల్లో ఆమె పాదయాత్ర చేశారు. మేడేపల్లి, కట్టకూరులో ఏర్పాటు చేసిన సభల్లో మాట్లాడారు. ‘‘కేసీఆర్ ను నమ్మి రెండుసార్లు అధికారమిస్తే, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. ఎనిమిదేండ్ల టీఆర్ఎస్ పాలనలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కేసీఆర్ కు పాలన చేతకావడం లేదు. సీఎం అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు” అని షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతల పిల్లలే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆడపిల్లల వైపు చూస్తే గుడ్లు పీకుతానన్న కేసీఆర్... మరి ఇప్పుడేందుకు టీఆర్ఎస్ నేతల గుడ్లు పీకడం లేదని ప్రశ్నించారు. ఉన్నోడికి ఒక న్యాయం.. లేనోడికి ఒక న్యాయమా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతలందరూ రౌడీలుగా తయారయ్యారని ఆరోపించారు. ఇసుక దగ్గరి నుంచి అన్ని కాంట్రాక్టుల్లోనూ టీఆర్ఎస్ మాఫియాదే నడుస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, తాము అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులు రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ‘‘మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి. కేసీఆర్ మళ్లీ వస్తారు. గాడిదకు రంగు పూసి ఇదే ఆవు అంటారు. ప్రజలు మోసపోవద్దు” అని ఆమె సూచించారు.
కార్యకర్తల ఆందోళన...
షర్మిలపై మంత్రి పువ్వాడ అజయ్ చేసిన కామెంట్లకు నిరసనగా ముదిగొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఖమ్మం–కోదాడ రోడ్డుపై వైఎస్సార్ టీపీ కార్యకర్తలు రాస్తారోకో చేశారు. మంత్రి దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి దగ్ధం చేశారు.
అగ్నిపథ్‌ను రద్దు చేయాలె
హైదరాబాద్, వెలుగు: అగ్నిపథ్ స్కీమ్‌ను వెంటనే రద్దు చేయాలని, పాత పద్ధతిలోనే ఆర్మీ రిక్రూట్‌మెంట్లు చేపట్టాలని వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షురాలు షర్మిల కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన విధ్వంసానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న బుర్ర తక్కువ నిర్ణయమే కారణమంటూ ఆమె శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమైన యువతకు, అగ్నిపథ్ పేరిట కాంట్రాక్టు ఉద్యోగాలు ఇచ్చి అవమానించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. అందువల్లే యువత నిరసనకు దిగారని, ఇదే అదనుగా పుండు మీద కారం చల్లినట్టు కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శించారు. నిరసనకారులను సముదాయించాల్సింది పోయి, తన రాజకీయాల కోసం వారిని మరింత రెచ్చగొట్టి పోలీస్ తూటాలకు బలి అయ్యేలా చేశారని షర్మిల ఆరోపించారు. యువకుల రక్తంతో రగులుతున్న మంటల్లో కేసీఆర్ చలి కాచుకుంటున్నారని విమర్శించారు.