
హైదరాబాద్ : మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా ..లైంగికంగా వేధిస్తున్న ఓ వ్యక్తి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని..పలువురు బాధిత మహిళలు మానవహక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. మల్కాజిగిరి నియోజకవర్గంలోని యాప్రాల్ ప్రాంతంలోని మోక్ష అపార్ట్ మెంట్ లో 15 కుటుంబాలు జీవనం సాగిస్తున్నామని మహిళలు కమిషన్ కు వివరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ స్థిరపడి ఉద్యోగాలు చేస్తుండగా.. మరికొంత మంది పదవీ విరమణ పొంది, పెన్షన్ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు.
అయితే ఇటీవల వెంకట్ రెడ్డి అనే వ్యక్తి తమ అపార్ట్ మెంట్ లో ప్లాట్ కొనుగోలు చేశారని…అప్పటి నుండి వెంకట్ రెడ్డితోపాటు సాఫ్ట్ వెర్ ఉద్యోగాలు చేస్తున్న అతని కుమారులైన నవ్యాంత్ రెడ్డి, వినయంత్ రెడ్డిల దౌర్జన్యాలు ఎక్కువైయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇండ్లలో సహాయకులుగా పనిచేయడానికి వచ్చే పని మనుషులను కూడా వేధిస్తున్నారని పేర్కొన్నారు. అతనిని ఎదుర్కొనే శక్తి లేక తీవ్ర మానసికవేదన, భయాందోళనకు గురైతున్నామని..ఈ విషయంలో పోలిస్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకట్ రెడ్డి, అతని కుమారులతో ప్రాణహాని ఉన్నదని… న్యాయం చేయాలని మహిళలు హెచ్చార్సీని వేడుకున్నారు.