V6 News

డీలిమిటేషన్కు మహిళా బిల్లు ముసుగు.. జనాభా లెక్కలు లేకుండా చేస్తామనడం రాజ్యాంగంపై దాడే: సోనియా గాంధీ

డీలిమిటేషన్కు మహిళా బిల్లు ముసుగు.. జనాభా లెక్కలు లేకుండా చేస్తామనడం రాజ్యాంగంపై దాడే: సోనియా గాంధీ
  • రాజకీయ ప్రయోజనాల కోసమే ఎన్నికల టైమ్​లో మోదీ ఈ బిల్లు తెస్తున్నరు
  • మూడుసార్లు ఆల్​పార్టీ మీటింగ్​కోరినా తిరస్కరించారు 
  • మొండి పట్టుదలకు పోతూ ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నరు
  • సౌత్,​ చిన్న రాష్ట్రాలను బలి పెట్టబోతున్నారని ఆరోపణ
  • ‘ది హిందూ’ పత్రికలో కాంగ్రెస్​ అగ్రనేత ఆర్టికల్

న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ల బిల్లు కంటే నియోజకవర్గాల పునర్విభజనే(డీలిమిటేషన్) అత్యంత ముఖ్యమైన అంశమని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌‌పర్సన్ సోనియా గాంధీ తెలిపారు. జనాభా లెక్కలతో సంబంధం లేకుండా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడం రాజ్యాంగంపై నేరుగా దాడి చేయడమేనని అన్నారు. డీలిమిటేషన్ ప్రతిపాదన ‘అత్యంత ప్రమాదకరం’ అని పేర్కొన్నారు. ఈ మేరకు ది హిందూ పత్రికలో సోనియా గాంధీ ఆర్టికల్​రాశారు. 

ప్రధాని మోదీ అసలు నిజాలు చెప్పడంలేదని ఆరోపించారు. తమిళనాడు, బెంగాల్ ఎన్నికల ప్రచారం జోరుగా నడుస్తున్న సమయంలో ఈ బిల్లు  కోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడంపై సందేహాలు వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ లబ్ధి పొందడానికే ఇంత హడావిడిగా సమావేశాలు పెడుతున్నారని ఆమె నిరసన వ్యక్తం చేశారు.

 రిజర్వేషన్లు, డీలిమిటేషన్ అంశాలపై కేంద్రం తీసుకొచ్చిన కొత్త ప్రతిపాదనలు చర్చించేందుకు బెంగాల్ ఎన్నికలు ముగిసిన తర్వాత సమావేశం ఏర్పాటు చేయాలని విపక్షం ఇప్పటికే మూడుసార్లు కేంద్రానికి లేఖ రాసిందని, కానీ ప్రధాని తమ అభ్యర్థనను తిరస్కరించారని ఆమె ఆరోపించారు. నిర్ణయాలు తీసుకునే విషయంలో ‘తన మాటే నెగ్గాలి’ అన్నట్టుగా ప్రధాని వ్యవహరిస్తున్న తీరు విచారకరమని సోనియా మండిపడ్డారు. 2023లో ఆమోదించిన నారీ శక్తి వందన్ అధినియం చట్టాన్ని 2029 నుంచి అమలు చేస్తామని మోదీ చెప్తున్నారు.. అమలు చేసేందుకు 30 నెలల టైమ్​ ఎందుకని నిలదీశారు.

  • దక్షిణాది రాష్ట్రాలకు ద్రోహం..

నియోజకవర్గాల పునర్విభజన అంశం అత్యంత ప్రమాదకరమైందని, రాజ్యాంగ సూత్రాలను దెబ్బతీస్తుందని సోనియా స్పష్టం చేశారు. లోక్‌‌సభ స్థానాలను పెంచే ఏ డీలిమిటేషన్ అయినా కేవలం అంకెల లెక్క మాత్రమే కాకూడదని, రాజకీయంగా కూడా సమానత్వం తప్పనిసరని పేర్కొన్నారు. లోక్‌‌సభ, రాష్ట్ర శాసనసభల సీట్లను పెంచడంపై తమకు అభ్యంతరంలేదని, కానీ 2027 జనాభా లెక్కల తర్వాత మాత్రమే జరగాలని సోనియా క్లియర్​గా చెప్పారు. కుటుంబ నియంత్రణలో దేశానికే ఆదర్శంగా నిలిచిన దక్షిణాది రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు జనాభా ఆధారిత డీలిమిటేషన్‌‌లో నష్టపోతాయని హెచ్చరించారు.

  • మోదీ అసలు వ్యూహం.. కులగణన వాయిదా  

2021లో జరగాల్సిన జనాభా లెక్కలను మోదీ సర్కారు ఐదేండ్లు నిర్లక్ష్యం చేసిందని సోనియా ఆరోపించారు. దీని వల్ల జాతీయ ఆహార భద్రతా చట్టం కింద 10 కోట్ల మంది ప్రజలు తమ హక్కులు కోల్పోయారని తెలిపారు. కులగణన చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ కోరినప్పుడు ప్రధాని మోదీ దానిని వ్యతిరేకించారని, సుప్రీంకోర్టులో అఫిడవిట్లు కూడా దాఖలు చేశారని, కానీ ఇప్పుడు స్వయంగా ఆయనే 2027 సెన్సస్‌‌లో కులగణన చేస్తామని ప్రకటించారని విమర్శించారు. 

బిహార్, తెలంగాణ రాష్ట్రాలు 6 నెలల్లోనే కుల సర్వే పూర్తిచేశాయని, కులగణన సెన్సస్‌‌ను ఆలస్యం చేస్తుందనే వాదన పచ్చి అబద్ధమని చెప్పారు. మోదీ అసలు లక్ష్యం కుల గణనను మళ్లీ వాయిదా వేయడమేనని ఆరోపించారు. బీజేపీకి తాత్కాలికంగా రాజకీయ లాభం జరగవచ్చు, కానీ దీర్ఘకాలంలో దేశానికి నష్టమని హెచ్చరించారు. ఈ మొత్తం ప్రక్రియ లోపభూయిష్టంగా వ్యతిరేకంగా ఉందన్నారు. మహిళా రిజర్వేషన్ సమస్య ఇప్పటికే పరిష్కారమైందని, అసలు అంశం 
డీలిమిటేషన్ మాత్రమేనని ఆమె వివరించారు.