- 31 జిల్లాల్లో 62 సైట్లు గుర్తింపు ఏర్పాటులో ముందడుగు
- రెవెన్యూ శాఖ నుంచి మహిళా సమాఖ్యలకు ట్రాన్స్‌ఫర్
- 12 చోట్ల మొదలైన పనులు
- ఖమ్మం జిల్లా రాజుపాలెంలో పూర్తయిన పనులు,
- త్వరలోనే గ్రిడ్‌కు అనుసంధానం
హైదరాబాద్, వెలుగు : మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు మరో కీలక అడుగుపడింది. రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో జిల్లాకు రెండు చొప్పున పవర్ ప్లాంట్ల నిర్మాణానికి 62 చోట్ల ప్రభుత్వ స్థలాలను గుర్తించారు. ఈ స్థలాలను రెవెన్యూ శాఖ నుంచి మహిళా సమాఖ్యలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో 1,000 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్ పనులు స్పీడందుకున్నాయి.
సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు తెలంగాణ రెడ్ కో సంస్థ గతంలోనే ఆరు కంపెనీలకు టెండర్లు ఫైనల్ చేయడంతో.. ఆయా కంపెనీలు రాష్ట్రవ్యాప్తంగా 12 చోట్ల పనులు మొదలు పెట్టాయి. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని రాజుపాలెంలో సోలార్ పవర్ ప్లాంట్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఇక్కడ పవర్జనరేషన్ స్టార్ట్‌చేసి గ్రిడ్‌కు అనుసంధానం చేస్తామని రెడ్‌కో ఆఫీసర్లు చెప్తున్నారు.
- రూ.3 వేల కోట్లతో 1,000 మెగావాట్ల ఉత్పత్తి...
గ్రీన్ ఎనర్జీని పెంపొందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి స్కీమ్ ద్వారా మహిళా సంఘాల ఆధ్వర్యంలో1,000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జిల్లా, మండల, గ్రామ సమాఖ్యల ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది.
ఒక్కో మెగావాట్‌కు రూ.2.95 కోట్ల చొప్పున ఖర్చు చేయాలని మొదట్లో భావించినప్పటికీ... జీఎస్టీ తగ్గడంతో ఒక్కో మెగావాట్ ఖర్చు రూ.2.84 కోట్లకు చేరింది. పెట్టుబడులకు నాబార్డు, ఇతర జాతీయ బ్యాంకుల సహకరిస్తుండగా, ప్రభుత్వ రెవెన్యూ, ఐబీ, నీటిపారుదల, ఎస్సారెస్పీ తదితర ప్రభుత్వ స్థలాలను కేటాయించారు. పీఎం కుసుమ్ స్కీం కింద విద్యుత్ డిస్కమ్‌లు రైతులతో యూనిట్‌కు రూ.3.13 చొప్పున పవర్ పర్చేస్ అగ్రిమెంట్ చేసుకోగా... మహిళా సంఘాలకు సంబంధించి ఇంకా అగ్రిమెంట్లు ఫైనల్ కాలేదు. అయినా ప్రభుత్వ సహకారంతో చేపడుతున్న ప్రాజెక్ట్ కావడంతో పనులు మొదలుపెట్టారు.
- జిల్లాకు రెండు యూనిట్ల చొప్పున 62 సైట్లు..
తొలిదశలో హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలు మినహా మిగతా 31 జిల్లాల్లో ఒక్కో జిల్లాకు రెండు మెగావాట్ల చొప్పున 62 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ల నిర్మాణానికి టీజీ రెడ్‌కో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో మెగావాట్విద్యుత్ ఉత్పత్తికి 3 నుంచి 4 ఎకరాల స్థలం అవసరం ఉండడంతో... రెవెన్యూ, సెర్ప్ ఆఫీసర్లు స్థల సేకరణ పూర్తి చేశారు.
సుమారు 200 ఎకరాలకుపైగా గుర్తించిన స్థలాలను రెవెన్యూ ఆఫీసర్లు మండల సమాఖ్యల పేరిట బదిలీ చేశారు. టీజీ రెడ్‌కో సంస్థ పవర్ ప్లాంట్ల నిర్మాణ పనులు చేపట్టే టెండర్ ప్రక్రియను ఇది వరకే పూర్తి చేసింది. రెడ్‌కో సంస్థ ఇచ్చిన డీపీఆర్ ప్రకారం పనులు చేయడానికి ముందుకొచ్చిన ఆరు కంపెనీలతో అగ్రిమెంట్లు చేసుకుంది. పనులు పూర్తి చేసి పవర్ జనరేషన్ స్టార్ట్ చేశాక బ్యాంకు రుణం తీరే వరకు ఏడాదికి రూ.10 లక్షలు, బాకీ తీరిన తర్వాత ఏడాదికి రూ.40లక్షలకు పైగా మహిళా సంఘాలకు ఆదాయం
సమకూరనుంది.
- 12 చోట్ల మొదలైన పనులు
ఇందిరా మహిళా శక్తి స్కీమ్‌లో భాగంగా చేపట్టిన సోలార్ పవర్ జనరేషన్ ప్లాంట్ల నిర్మాణ పనులు ఇప్పటికే 12 చోట్ల మొదలైనట్లు సెర్ప్, టీజీ రెడ్‌కో ఆఫీసర్లు తెలిపారు. ఖమ్మం, అసిఫాబాద్, వికారాబాద్, పెద్దపల్లి, హనుమకొండ, రంగారెడ్డి, యాదాద్రి జిల్లాలో పనులు మొదలుపెట్టినట్లుగా చెప్పారు. టెండర్లు దక్కించుకున్న కంపెనీలు ప్రభుత్వం సూచించిన స్థలాలను చదును చేసి సోలార్ ప్యానెల్స్బిగించే పనులు చేపట్టారని టీజీ రెడ్‌కో వైస్ చైర్మన్ అనిల తెలిపారు.
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని రాజుపాలెంలో చేపట్టిన సోలార్ పవర్ ప్లాంట్ పనులు చివరి దశకు వచ్చాయన్నారు. సోమవారం ట్రయల్ రన్ కూడా నిర్వహించామని, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా త్వరలోనే ప్లాంట్‌ను ప్రారంభిస్తామని సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ పేర్కొన్నారు. మిగతా జిల్లాల్లో కూడా త్వరలోనే పనులు స్టార్ట్ చేసి 45 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు.

