గెలిస్తే.. చరిత్రే! నేడు ఇంగ్లండ్‌‌తో సెమీఫైనల్​

గెలిస్తే.. చరిత్రే! నేడు ఇంగ్లండ్‌‌తో సెమీఫైనల్​

ఫైనల్‌‌ బెర్త్‌‌పై ఇండియా గురి

మ్యాచ్​కు వాన ముప్పు 

ఉ. 9.30 నుంచి స్టార్‌‌స్పోర్ట్స్‌‌లో

ఆరు వరల్డ్‌‌‌‌కప్స్‌‌‌‌ ఆడితే.. ఒక్కసారీ ఫైనల్‌‌‌‌కు చేరని దుస్థితి..! లెజెండ్స్‌‌‌‌ ప్రయత్నించినా.. ఇప్పటివరకు సెమీసే మన అత్యుత్తమ స్థితి..!  మరి ఇప్పుడైనా టీమిండియా పరిస్థితి మారేనా..? లీగ్‌‌‌‌ దశలో కొట్టిన విక్టరీలు.. నాకౌట్‌‌‌‌లోనూ కొనసాగేనా..? ఫస్ట్‌‌‌‌ టైమ్‌‌‌‌ ఇండియా ఫైనల్‌‌‌‌ చేరేనా..? వీటన్నింటికీ సమాధానం దొరకాలంటే.. నేడు ఇంగ్లండ్‌‌‌‌తో జరిగే కీలకమైన సెమీస్‌‌‌‌ పోరులో ఇండియా మహిళల పోరాటం వినువీధికి ఎక్కాల్సిందే..! ఇప్పుడున్న పరిస్థితులు, ఫామ్‌‌‌‌ను బట్టి చూస్తే… మనపై అంచనాలు భారీగా పెరిగాయి..! ఆశించని అద్భుతాలూ జరిగాయి.. ఆటలో స్థాయి కూడా పెరిగింది..! అయినా ఇంగ్లండ్‌‌‌‌ను తక్కువగా అంచనా వేయలేని పరిస్థితి..! వరల్డ్‌‌‌‌ నంబర్‌‌‌‌వన్‌‌‌‌ బ్యాటర్ మన ఆయుధమైతే.. టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌ బౌలర్‌‌‌‌ అపోజిషన్‌‌‌‌కు ఆయువుపట్టు..! మరి ఈ ఇద్దరి మధ్య పోరాటాన్ని చూడాలంటే వాన దేవుడు కనికరించాల్సిందే..!!

సిడ్నీ: 2018లో మహిళల టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ సెమీస్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌… ఇంగ్లండ్‌‌‌‌ చేతిలో ఇండియా ఓటమి..! 2017లో వన్డే ప్రపంచకప్‌‌‌‌ ఫైనల్‌‌‌‌.. ఇంగ్లండ్‌‌‌‌ చేతిలో ఇండియాకు తప్పని పరాజయం…! ఈ రెండింటికీ ప్రతీకారం తీర్చుకునే గొప్ప చాన్స్‌‌‌‌ ఇప్పుడు టీమిండియాకు వచ్చింది. గురువారం జరిగే టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ తొలి సెమీస్‌‌‌‌లో హర్మన్‌‌‌‌సేన.. బలమైన ఇంగ్లండ్‌‌‌‌తో అమీతుమీ తేల్చుకోనుంది. లీగ్‌‌‌‌ దశలో నాలుగు గొప్ప విజయాలతో ఇండియా ఫామ్‌‌‌‌ టాప్‌‌‌‌ గేర్‌‌‌‌లో ఉంది. అయితే హిస్టరీ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. 2012, 2014, 2016 లీగ్‌‌‌‌ దశలోనే వెనుదిరిగిన ఇండియా.. 2009, 2010, 2018లో మాత్రమే సెమీస్‌‌‌‌లోకి అడుగుపెట్టింది. మరి నాకౌట్‌‌‌‌లో చాలా డిఫరెంట్‌‌‌‌గా ఆడే ఇంగ్లండ్‌‌‌‌ను దాటి ఫైనల్‌‌‌‌కు చేరుతుందా అన్నది చూడాలి. అయితే 2018 సెమీస్‌‌‌‌లో ఆడిన ఏడుగురు ప్రస్తుత టీమ్‌‌‌‌లో ఉండటం కాస్త అనుకూలించే అంశం. ఓవరాల్‌‌‌‌గా బలం, బలహీనతల్లో సమానంగా ఉన్న ఇరుజట్లు ఈ మ్యాచ్‌‌‌‌లో ఫేవరెట్‌‌‌‌గానే దిగుతున్నాయి. అయితే వర్షం వల్ల మ్యాచ్‌‌‌‌ ఎంతమేరకు జరుగుతుందో చూడాలి.

షెఫాలీ మెరిస్తే..

ఈ మ్యాచ్‌‌‌‌ కోసం ఇండియా ఫైనల్‌‌‌‌ ఎలెవన్‌‌‌‌లో మార్పులు చేయడం లేదు. విన్నింగ్‌‌‌‌ కాంబినేషన్‌‌‌‌ను మార్చేందుకు కెప్టెన్‌‌‌‌ కౌర్‌‌‌‌, మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ సాహసించడం లేదు. దీంతో ఓపెనర్లలో షెఫాలీ మరోసారి మెరిస్తే టీమిండియాకు భారీ స్కోరు సాధ్యమైనట్లే. ఇప్పటివరకు నాలుగు ఇన్నింగ్స్‌‌‌‌ల్లో కలిపి  161 రన్స్‌‌‌‌ చేసిన ఆమె.. ఈ టోర్నీలో మూడో హయ్యెస్ట్‌‌‌‌ స్కోరర్‌‌‌‌గా నిలిచింది. వన్‌‌‌‌డౌన్‌‌‌‌లో రోడ్రిగ్స్‌‌‌‌ కూడా మంచి టచ్‌‌‌‌లో ఉంది. అయితే రెండో ఓపెనర్‌‌‌‌ స్మృతి మంధాన, కెప్టెన్‌‌‌‌ హర్మన్‌‌‌‌ ప్రీత్‌‌‌‌ అంచనాలను అందుకోవడం లేదు. ఇది ప్రతికూలమైనా.. నాకౌట్‌‌‌‌లో ఈ ఇద్దరూ కమ్‌‌‌‌బ్యాక్‌‌‌‌ అయితే ఇండియాకు తలనొప్పి తగ్గినట్లే. మ్యాచ్‌‌‌‌ పరిస్థితులను బట్టి మిడిలార్డర్‌‌‌‌లో వేద, తానియా, శిఖా పాండే, రాధా యాదవ్‌‌‌‌.. బ్యాట్లు ఝళిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. బౌలింగ్‌‌‌‌లో లెగ్ స్పిన్నర్‌‌‌‌ పూనమ్‌‌‌‌ యాదవ్‌‌‌‌ సూపర్‌‌‌‌ ఫామ్‌‌‌‌లో ఉంది. నాలుగు మ్యాచ్‌‌‌‌ల్లో 9 వికెట్లు తీసి టాప్‌‌‌‌లో కొనసాగుతోంది. రెండో ఎండ్‌‌‌‌లో శిఖా కూడా రాణిస్తుండటం అదనపు బలం. సిడ్నీ పిచ్‌‌‌‌పై ఇద్దరు స్పిన్నర్లు మెరిస్తే ఇంగ్లండ్‌‌‌‌కు కష్టాలు తప్పవు. అయితే ఫీల్డింగ్‌‌‌‌లో టీమిండియా కాస్త శ్రమించాల్సి ఉంది.

సీవర్‌‌‌‌పైనే భారం..

ఆడిన నాలుగు మ్యాచ్‌‌‌‌ల్లో మూడు గెలిచిన ఇంగ్లండ్‌‌‌‌.. గ్రూప్‌‌‌‌–బిలో రెండో స్థానంతో సెమీస్‌‌‌‌ బెర్త్‌‌‌‌ను ఖాయం చేసుకుంది. తొలి మ్యాచ్‌‌‌‌లో బలమైన సౌతాఫ్రికా చేతిలో ఓడినా.. లాస్ట్‌‌‌‌ లీగ్‌‌‌‌లో వెస్టిండీస్‌‌‌‌ను కట్టడి చేయడంతో ఇంగ్లిష్‌‌‌‌ టీమ్‌‌‌‌లో కాన్ఫిడెన్స్‌‌‌‌ పెరిగింది. నటాలీ సీవర్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌లో సూపర్‌‌‌‌ ఫామ్‌‌‌‌లో ఉంది. ఇప్పటికే 67.33 యావరేజ్‌‌‌‌తో 202 రన్స్‌‌‌‌ చేసింది. ఇండియా బౌలర్లు సీవర్‌‌‌‌ను కట్టడి చేయగలితే ఇంగ్లండ్‌‌‌‌ భారీ స్కోరుకు కళ్లెం పడినట్లే. కెప్టెన్‌‌‌‌ నైట్‌‌‌‌, బీమోంట్‌‌‌‌, వాట్‌‌‌‌, విల్సన్‌‌‌‌, జోన్స్‌‌‌‌పై కూడా అంచనాలు పెరిగాయి. బౌలింగ్‌‌‌‌లో వరల్డ్‌‌‌‌ నంబర్‌‌‌‌ వన్‌‌‌‌ బౌలర్‌‌‌‌ ఎకిల్‌‌‌‌స్టోన్‌‌‌‌ (8 వికెట్లు)పై  ఇంగ్లండ్​ భారీ ఆశలు పెట్టుకుంది. పేసర్‌‌‌‌ ష్రబ్​సోల్ (7 వికెట్లు) కూడా చెలరేగితే ఇండియాకు ఇబ్బందులు తప్పవు. ఓవరాల్‌‌‌‌గా ఇండియా బ్యాటింగ్‌‌‌‌కు, ఇంగ్లండ్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌కు రసవత్తర పోరు మాత్రం ఖాయం.

టీ20 వరల్డ్‌‌కప్స్‌‌లో ఇండియాపై ఇంగ్లండ్‌‌ 5-0 రికార్డు ఇది. 2009, 2012, 2014, 2018లో టీమిండియాపై ఇంగ్లిష్‌‌ జట్టు గెలిచింది.

ఈ టోర్నీలో షెఫాలీ వర్మ స్ట్రయిక్‌‌ రేట్‌‌ 161.0. ఏ టోర్నీలోనైనా ఇండియా తరఫున ఇదే బెస్ట్.

ఎకిల్‌‌స్టోన్‌‌ ఎకానమీ రేట్‌‌ 3.23. ఈ కాంపిటిషన్‌‌లో ఇదే బెస్ట్‌‌.

జట్లు (అంచనా)

ఇండియా: హర్మన్‌‌ప్రీత్‌‌ (కెప్టెన్‌‌), స్మృతి, షెఫాలీ, రోడ్రిగ్స్‌‌, దీప్తి, వేదా కృష్ణమూర్తి, తానియా భాటియా, శిఖా పాండే, రాధా యాదవ్‌‌, పూనమ్‌‌ యాదవ్‌‌, రాజేశ్వరి

ఇంగ్లండ్‌‌: హీథర్‌‌ నైట్‌‌ (కెప్టెన్‌‌), డానియల్‌‌ వాట్‌‌, బీమోంట్‌‌, సీవర్‌‌, విల్సన్‌‌, జోన్స్‌‌, బ్రంట్‌‌, ష్రబ్​సోల్, ఎకిల్‌‌స్టోన్‌‌, సారా గ్లెన్‌‌.

పిచ్‌‌, వాతావరణం

స్పిన్నర్లకు అనుకూలం. వర్షం ముప్పు ఉండటంతో పరిస్థితి భిన్నంగా మారే చాన్స్‌‌ కూడా ఉంది.