హైదరాబాద్, వెలుగు: సినీ నటుడు శివాజీకి రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. మహిళలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలను కమిషన్ తీవ్రంగా పరిగణించింది. దీనిపై సుమోటోగా కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించింది. సోమవారం జరిగిన దండోరా సినిమా ఈవెంట్ లో నటుడు శివాజీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని, తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని కమిషన్ అభిప్రాయపడింది. ఉద్దేశపూర్వకంగానే మహిళల పరువు తీసేలా ఆయన వ్యాఖ్యలు చేశారని ప్రాథమికంగా నిర్ధారించింది.
రాష్ట్ర మహిళా కమిషన్ చట్టం-1998, సెక్షన్ 16 (1) (బీ) కింద ఈ వ్యవహారాన్ని సుమోటో కేసుగా స్వీకరించింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు ఈ నెల 27న ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ లోని బుద్ధభవన్ లో ఉన్న కమిషన్ కార్యాలయంలో స్వయంగా హాజరుకావాలని శివాజీని ఆదేశించింది. విచారణకు హాజరుకాకపోతే తదుపరి చర్యలు ఉంటాయని నోటీసుల్లో స్పష్టం చేసింది.
