ఇవాళ(ఆగస్టు 23) వరల్డ్ లేక్ డే ..సేవ్ సాగర్.. సేవ్ లేక్స్

ఇవాళ(ఆగస్టు 23) వరల్డ్ లేక్ డే ..సేవ్ సాగర్.. సేవ్ లేక్స్

ఒకప్పుడు వేలాది చెరువులు, కుంటలు, జలాశయాలతో ‘సరస్సుల నగరం’ గా వెలుగొందిన హైదరాబాద్.. నేడు వేగవంతమైన పట్టణీకరణ, ఆక్రమణల కారణంగా ఆ అస్తిత్వాన్ని కోల్పోయే స్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలో కనుమరుగవుతున్న నగర జలవనరులను కాపాడుకునేందుకు ప్రభుత్వం, హైడ్రా’ వంటి ప్రత్యేక విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ ప్రేమికులు కలిసి సాగిస్తున్న పునరుద్ధరణ పోరాటంపై ‘ప్రపంచ సరస్సుల దినోత్సవం’ సందర్భంగా ఒక ప్రత్యేక విశ్లేషణ.

ఒకప్పుడు హైదరాబాద్​ నగరంలో కొన్ని దశాబ్దాల కిందట మూడు వేల నుంచి ఏడు వేల దాకా సరస్సులు, జలాశయాలు, నదులు, వాగులు, చెరువులు వంటి పలు జలవనరులు ఉండేవని అంచనా. వీటిలో కొన్ని సహజమైనవి కాగా మరికొన్ని మానవ నిర్మితమైనవి. కాలక్రమేణా కబ్జాలతో చిన్న కుంటలు అంతర్ధానం అయ్యాయి.

కనుమరుగైన కుంటలు

స్థానికంగా ఉన్న పలు చెరువులు, కుంటలు చాలావరకు పూర్తిగా కనుమరుగయ్యాయి. మిగిలి ఉన్న చెరువుల్లో చాలావరకు విస్తీర్ణం తగ్గిపోయి చిన్న కుంటలుగా మారిపోయాయి. తీగల్ కుంట, సోమాజిగూడ ట్యాంక్, మీర్ జుమ్లా చెరువు, పహార్ తీగల్ కుంట, కుంట భవానీ దాస్, నవాబ్ సాహెబ్ కుంట, అఫ్జల్ సాగర్, నల్లకుంట, మసాబ్ ట్యాంక్ వంటివి పూర్తిగా కనుమరుగయ్యాయి. వేగవంతమైన పట్టణాభివృద్ధి, భవన నిర్మాణాలు, భూ ఆక్రమణల కారణంగా పలు చారిత్రక జలాశయాలు కనుమరుగవడానికి లేదా కుచించుకుపోవడానికి దారితీసింది. పట్టణీకరణ, ఆక్రమణల వల్ల సరస్సుల నగరం అనే గుర్తింపు దెబ్బతింది.1979 నుంచి 2024వ సంవత్సరాల మధ్య హైదరాబాద్ తన సరస్సుల విస్తీర్ణంలో 61 శాతం కోల్పోయిందని, అసలు నీటి విస్తీర్ణం 39 శాతం మాత్రమే మిగిలిందని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) అధ్యయనంలో వెల్లడైంది.

కబ్జాలతో కుచించుకుపోయిన సరస్సులు

దశాబ్దాల కిందట కుతుబ్ షాహీ పాలకులు, నిజాంలు తాగునీటి, సాగునీటి కోసం కృత్రిమ, జలాశయాలను నిర్మించారు. దక్కన్ భూభాగం అంతటా విస్తారమైన జల వ్యవస్థలుండేవి. హుస్సేన్ సాగర్ సరస్సును1562లో నిర్మించారు. నాడు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, దుర్గం చెరువును నిర్మించారు. తాగునీటిని అందించడంతోపాటు వరదలను నియంత్రించడానికి మూసీ నదిపై ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను నిర్మించారు. హుస్సేన్ సాగర్, కుంట మల్లయ్యపల్లి వంటి సరస్సుల విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది.1970వ సంవత్సరంలో హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న వేలాది జలవనరుల్లో నేడు కేవలం 70 నుంచి 500 వరకు చెరువులు మాత్రమే మిగిలి ఉన్నాయి. 

హైదరాబాద్‌లో టాప్ 12 సరస్సులు

హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ సరస్సు, దుర్గంచెరువు, సఫిల్ గూడ చెరువు, దమ్మాయిగూడ, అమీన్‌పూర్ సరస్సు, నాగోల్ సరస్సు, సరూర్‌నగర్ సరస్సు, ఫాక్స్ సాగర్ సరస్సు, ఆల్వాల్ సరస్సులు పర్యాటక స్థలాలుగా మారాయి. వర్షాకాలంలో జలకళను సంతరించుకున్న ఈ సరస్సులు, చెరువుల సందర్శన ఒకింత ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి. హుస్సేన్ సాగర్ సరస్సు తీరాన లుంబినీపార్కు, సచివాలయం, ఎత్తైన అంబేద్కర్ విగ్రహం, చుట్టూ నెక్లెస్ రోడ్డు, మధ్యలో ఉన్న గౌతమ బుద్ధుని భారీ విగ్రహం, బోటు షికారు, ఇక్కడి ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. ఉస్మాన్ సాగర్ సరస్సు అద్భుతమైన అందాలు మంత్రముగ్ధులను చేస్తాయి. దుర్గం చెరువు చుట్టూ గ్రానైట్ రాళ్లు, పచ్చని పార్కు అందాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. దుర్గంచెరువులో బోటింగ్, చేపలు పట్టడం, రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్ వంటి అనేక కార్యకలాపాలను ఆస్వాదించొచ్చు. సఫిల్ గూడ చెరువు చుట్టూ దట్టమైన పచ్చని చెట్లు, వివిధ రకాల వలస పక్షులను చూడొచ్చు.

దీనికి ఆనుకుని పార్క్ ఉంది. ఇక్కడికి ప్రజలు మార్నింగ్ వాక్ కోసం వస్తుంటారు. హిమాయత్ సాగర్ సరస్సు ఆకర్షణీయమైన పిక్నిక్ ప్రదేశంగా ఉంది. దమ్మాయిగూడ సరస్సు వద్ద ప్రజలు వేడుకలు జరుపుకుంటారు. అమీన్‌పూర్ సరస్సు పక్షి శాస్త్రవేత్తలకు నిజమైన స్వర్గధామం. ఈ సరస్సు పలు వలస పక్షులకు నిలయం. బోటింగ్, క్యాంపింగ్, వాటర్ స్పోర్ట్స్ కార్యకలాపాలను ఆస్వాదించవచ్చు. సరూర్‌నగర్ సరస్సు దగ్గర మీ స్నేహితులతో కలిసి ఒక చిరస్మరణీయమైన వారాంతాన్ని గడపవచ్చు. నాగోల్ సరస్సు అద్భుతమైన అందం మంత్రముగ్ధులను చేస్తుంది. సందర్శకులు ఇక్కడ ఫొటోలు తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. శామీర్ పేట సరస్సు అద్భుతమైన సూర్యాస్తమయ దృశ్యాన్ని ఆస్వాదించొచ్చు. ఇక్కడ కూర్చుంటే చల్లని గాలిని ఆస్వాదించొచ్చు. ఫాక్స్ సాగర్ సరస్సు చేపలు పట్టడానికి, పక్షులను చూడటానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కుటుంబంతో కలిసి పిక్నిక్‌ కోసం ప్రజలు గుంపులు గుంపులుగా వస్తుంటారు. ఆల్వాల్ సరస్సు అందమైన పరిసరాలను ఆస్వాదించొచ్చు.

హైడ్రాకు జాతీయ డ్యామ్ సేఫ్టీ

హైదరాబాద్​లో హైడ్రా చేప‌ట్టిన చెరువుల‌ పున‌రుద్ధ‌ర‌ణ‌, అభివృద్ధి చాలా బాగుంద‌ని జాతీయ డ్యామ్ సేఫ్టీ నిపుణుల క‌మిటీ కితాబిచ్చింది. క్యాచ్‌మెంట్ ఏరియా నుంచి చెరువులోకి వ‌ర‌ద నీరు చేరేలా ఇన్‌లెట్లు, చెరువు నిండిన త‌ర్వాత కింద‌కు పోయేలా ఔట్‌లెట్ల అభివృద్ధితో పాటు ప‌టిష్టమైన‌ బండ్‌ల నిర్మాణం, చెరువుల‌ను ప‌రిర‌క్షిస్తూ సాగుతున్న హైడ్రా చెరువుల అభివృద్ధి దేశానికి న‌మూనా అని కొనియాడింది. న్యూఢిల్లీకి చెందిన జాతీయ డ్యామ్ సేఫ్టీ నిపుణుల కమిటీ ఛైర్మన్ డాక్టర్ శైలేష్ కుమార్ శ్రీ‌వాస్త‌వ నేతృత్వంలోని స‌భ్యులు నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి ఫాక్స్ సాగర్ సరస్సును తాజాగా సందర్శించారు. ప్రజా ఆస్తుల పరిరక్షణతో పాటు చెరువులు, సరస్సుల పునరుద్ధరణకు హైడ్రా చేపడుతున్న కార్యక్రమాలను జాతీయ డ్యామ్ సేఫ్టీ నిపుణుల కమిటీ సభ్యులు అభినందించారు.సరస్సులు కేవలం నీటి నిల్వలు కాదు.. భూగర్భ జలాలకు ఆధారం, జీవవైవిధ్యానికి నిలయం, వరద నియంత్రణకు రక్షణ కవచం. అందుకే ‘సరస్సుల నగరం’గా హైదరాబాద్‌ పూర్వ వైభవాన్ని తిరిగి సంతరించుకోవాలంటే.. ప్రతి చెరువును కాపాడాలి.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలి.

ఆరు సరస్సుల సుందరీకరణ

ఇప్పటికే ఆరు సరస్సులను పునరుద్ధరించారు. మొద‌టి విడ‌త చేప‌ట్టిన ఆరు చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ‌లో ఆక్ర‌మణల‌ను తొల‌గించ‌డంతో 75 ఎక‌రాల అద‌న‌పు భూమి అందుబాటులోకి వ‌చ్చింది. అంబర్ పేటలోని బతుకమ్మ కుంట, కూకట్ పల్లిలోని నల్ల చెరువు, పాతబస్తీలోని భమృకున్ - ఉద్ - దౌలా చెరువు, మాదాపూర్ లోని తమ్మిడికుంట, సున్నం చెరువు, ఉప్పల్ లోని నల్ల చెరువును సుందరీకరించారు.

నాలుగు మినీ ట్యాంక్ బండ్లు

హైడ్రా మ‌రో 20 చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ‌కు అడుగులు వేస్తోంది. రెండో విడ‌త పున‌రుద్ధ‌రిస్తున్న 14 చెరువుల్లో ఉన్న ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించ‌డం ద్వారా 168 ఎక‌రాల‌ను అద‌నంగా స‌మ‌కూర్చింది హైడ్రా. వీటికితోడు న‌గ‌రం న‌లువైపులా మినీ ట్యాంక్‌బండ్‌ల‌ను అభివృద్ధి చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం భావించింది. ఇందులో భాగంగా మ‌రో నాలుగు పెద్ద చెరువుల‌ను అభివృద్ధి చేస్తోంది. ఖాజాగూడలోని తౌతానికుంట, పుప్పాలగూడ భాగీరథమ్మ చెరువు, మదీనగూడ ఈర్ల చెరువు, బాచుపల్లి – ఎర్రకుంట చెరువు, రామంతాపూర్ పెద్ద చెరువు, సాహెబ్ గర్ కాప్రా చెరువు, నల్లగండ్ల చెరువు, గంగారం పెద్ద చెరువు, మూసాపేట్ కాముని చెరువు, కూకట్ పల్లి రంగధాముని కుంట, ఇబ్రహీం చెరువు, నాచారం పెద్ద చెరువు, జూబ్లీహిల్స్ కృష్ణకాంత్ పార్క్, నిజాంపేట్ తుర్క చెరువులను అభివృద్ధి చేయాలని హైడ్రా నిర్ణయించింది. మహా నగరం నలుదిక్కులా ఉన్న ప్రగతినగర్​లోని అంబీర్ చెరువు, జీడిమెట్లలోని ఫాక్స్ సాగర్ లేక్, అమీన్ పూర్ పెద్ద చెరువు, సరూర్ నగర్ పెద్ద చెరువులను మినీ ట్యాంక్ బండ్లుగా తీర్చిదిద్దాలని హైడ్రా కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది.

హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న సరస్సుల ఫుల్ ట్యాంక్ లెవెల్స్ లోపల ఉన్న అక్రమ ఆక్రమణలను హైడ్రా తొలగించి, మూసుకుపోయిన వర్షపునీటి ప్రవేశ మార్గాలను శుభ్రపరుస్తుంది. వరదలను నివారించడానికి, భూగర్భ జల మట్టాలను పెంచడానికి శాస్త్రీయ పద్ధతిలో పూడికతీత, కట్టల బలోపేత పనులను చేపడుతోంది. ఫాక్స్ సాగర్ సరస్సు పరిరక్షణ చర్యల్లో భాగంగా సరిహద్దుల నిర్ధారణ చేపట్టారు. ఉప్పల్ నల్ల చెరువులో ఆక్రమణదారుల నుంచి 10 ఎకరాలకు పైగా భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. మురుగునీటి బైపాస్ కాల్వలను నిర్మించారు. కమ్యూనిటీ వాకింగ్ ట్రాక్‌లు, పచ్చదనాన్ని జోడించారు. వాక్‌వేలు, ఓపెన్ జిమ్‌లు, పిల్లల ఆట స్థలాలను ఏర్పాటు చేయడం ద్వారా చెరువులను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు.

వరల్డ్ లేక్ డే 

హైదరాబాద్ నగరంలో ఆగస్టు 27న వరల్డ్ లేక్ డే (ప్రపంచ సరస్సుల దినోత్సవం) సందర్భంగా చెరువుల పరిరక్షణ, అవగాహన సదస్సులు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో సరస్సు తీర ప్రాంతాల శుభ్రత వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. లేక్ వాక్స్, పర్యావరణ ప్రేమికుల సమావేశాలు, హుస్సేన్ సాగర్, దుర్గం చెరువు సరస్సుల దగ్గర స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టనున్నారు. మంచినీటి వనరులు, జీవవైవిధ్యం, సరస్సుల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. పక్షులు, చేపలు, ఇతర వన్యప్రాణులకు ఆసరా ఇచ్చే నీటి వనరులను పరిరక్షించడం ద్వారా భూగర్భ జలాలను పునరుజ్జీవింపజేయొచ్చు. లేక్ సిటీలోని సరస్సుల సుందర చిత్రాలతో ప్రత్యేక ఫొటో ఎగ్జిబిషన్లు నిర్వహించడంతోపాటు సరస్సుల ప్రాధాన్యతను ప్రజలకు వివరించే కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఫొటోగ్రఫీ వాక్‌, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ ‘వేక్ ది లేక్’ కార్యక్రమం, సేవ్ సాగర్, రన్ ఫర్ లేక్స్ కార్యక్రమాలతో సరస్సులు సందడిగా మారనున్నాయి.