బీజేపీ, టీఆర్​ఎస్ నడుమ ఆగని మాటల యుద్ధం

బీజేపీ, టీఆర్​ఎస్ నడుమ ఆగని మాటల యుద్ధం
  • బీజేపీ, టీఆర్​ఎస్ నడుమ ఆగని మాటల యుద్ధం
  • పాదయాత్రలో విమర్శలకు పదును పెడుతున్న  బండి సంజయ్
  • బీజేపీ తీరును ఖండిస్తున్న టీఆర్ఎస్ లీడర్లు
  • సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఇరు పార్టీల నాయకులు
  • తాజాగా బీజేపీ పాదయాత్ర ఫ్లెక్సీల చింపివేత
  • జనగామ జిల్లాలో హీటెక్కిన పాలిటిక్స్

జనగామ, రఘునాథపల్లి, జనగామ అర్బన్, వెలుగు:  జనగామ జిల్లాలో ప్రజాసంగ్రామ యాత్ర ఇతర జిల్లాల కంటే భిన్నంగా సాగుతోంది. ఈ యాత్ర జిల్లాలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధానికి దారి తీస్తోంది. పాదయాత్రను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ లీడర్లు ప్రయత్నిస్తుండగా.. బీజేపీ లీడర్లు సైతం తగ్గేదేలే అన్నట్లుగా ముందుకెళ్తున్నారు. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ తనదైన శైలిలో విమర్శలకు పదును పెట్టి, కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఆ వెంటనే మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి.. బీజేపీ తీరును ఖండిస్తున్నారు. తాజాగా ఫ్లెక్సీ వార్ కూడా ఇరు పార్టీల మధ్య నడుస్తోంది. బీజేపీ బ్యానర్లను గుర్తు తెలియని వ్యక్తులు చింపేయగా.. అది టీఆర్ఎస్ పనేనని బీజేపీ లీడర్లు ఆరోపిస్తున్నారు. అది తమ పని కాదని టీఆర్ఎస్ లీడర్లు వాదిస్తున్నారు.మొత్తంగా జనగామ జిల్లాలో సాగుతున్న బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర.. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.

1000 కి.మీ. పూర్తి చేసుకున్న సంగ్రామ యాత్ర..

మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర 15వ రోజు జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కోలుకొండలో ప్రారంభమైంది. అప్పిడిపల్లె క్రాస్ రోడ్ వద్ద 1000 కిలోమీటర్ల మైలురాయి దాటింది. దీంతో బండి సంజయ్ కి ఆ పార్టీ లీడర్లు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పైలాన్ ను బండి సంజయ్ ఆవిష్కరించారు. అక్కడి నుంచి చీటూరు గ్రామానికి పాదయాత్ర చేరుకోగా.. గ్రామస్తులు గజమాలతో బండి సంజయ్​ని సత్కరించారు.  ఈ సంద్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ..  రాష్ట్రంలో కేసీఆర్ పనైపోయిందని, ఆయన గ్రాఫ్ పూర్తిగా తగ్గిపోయిందని విమర్శించారు. టీఆర్ఎస్ అవినీతి పాలనకు ప్రజలు గోరీ కట్టాలన్నారు. రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని దీమా వ్యక్తం చేశారు. మునుగోడులో ఎగరేది బీజేపీ జెండా మాత్రమేనన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని, రాష్ట్రపతి ఎన్నికల్లో ఇది బయటపడిందన్నారు. అనంతరం కిష్టగూడెం, కుందారం వరకు పాదయాత్ర సాగింది. నేడు నెల్లుట్ల మీదుగా జనగామ జిల్లా కేంద్రానికి చేరుకోనుంది.

దమ్ముంటే నిధులు తెప్పించు:  ముత్తిరెడ్డి

కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు తెప్పించాకే బండి సంజయ్​పాదయాత్ర చేపట్టాలని ఎమ్మెల్యు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్​తన పాదయాత్రతో ప్రజలకు ఏం ఒరగబెడుతున్నారని మండిపడ్డారు. నీతి అయోగ్ సిఫారసు చేసిన రూ.24 వేల కోట్లు కేంద్రం నుంచి తీసుకొచ్చే దమ్ము ఉందా? అని ప్రశ్నించారు. జనగామ మెడికల్​ కాలేజీకి కేంద్రం నిధులు ఇస్తుందో, ఇవ్వదో సమాధానం చెప్పాలన్నారు. కాగా, తాము ఫ్లెక్సీలు చింపారన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు.

టీఆర్ఎస్ ది గూండాల పార్టీ: దశమంతరెడ్డి

టీఆర్ఎస్ ది గూండాల పార్టీ అని, పాదయాత్ర ఫ్లెక్సీలు చింపడం హేయమైన చర్య అని బీజేపీ జనగామ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో పాదయాత్ర చేస్తుంటే టీఆర్ఎస్ లీడర్లు ఉద్దేశ పూర్వకంగానే అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఫ్లెక్సీలు చింపించడం మానేసి, నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టిపెట్టాలని సూచించారు.

దాడులకు కారణం ఎర్రబెల్లి: రాజవర్ధన్ రెడ్డి

మహబూబాబాద్ అర్బన్, వెలుగు: బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేకే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. బండి సంజయ్ పాదయాత్రపై దాడులు చేయిస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.రాజవర్ధన్ రెడ్డి ఆరోపించారు. బుధవారం మహబూబాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాదయాత్రపై దాడిచేసే టీఆర్ఎస్ గూండాలను మంత్రి ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని పేర్కొన్నారు.