హుస్నాబాద్లో 250 పడకల ఆసుపత్రి పనులు షురూ.. 6 అంతస్థుల్లో నిర్మాణం

హుస్నాబాద్లో 250 పడకల ఆసుపత్రి పనులు షురూ.. 6 అంతస్థుల్లో నిర్మాణం
  •     రూ.82 కోట్లు     మంజూరు చేసిన ప్రభుత్వం
  •     పూర్తయితే పేదలకు అందుబాటులోకి కార్పొరేట్ ​వైద్యం 

సిద్దిపేట/ హుస్నాబాద్, వెలుగు: హుస్నాబాద్​లో 250 పడకల ఆస్పత్రి పనులు ప్రారంభమయ్యాయి. 100 పడకల ఆస్పత్రిని 2 నెలల క్రితం కూల్చివేసి, వైద్య సేవలను స్థానిక మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో అందిస్తున్నారు. ఇక్కడి ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో సిద్దిపేట, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్​ వెళ్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

ఒక్కోసారి దారిలోనే ప్రాణాలు పోతున్నాయి. కొత్త హాస్పిటల్​పూర్తయితే ఉత్తర తెలంగాణలోనే ఈ ప్రాంతం హెల్త్ హబ్ గా మారుతుంది.  ప్రభుత్వ ఆస్పత్రిని అప్​గ్రేడ్​చేయడంతో త్వరలోనే పనులు పూర్తయి పేదలకు కార్పొరేట్​వైద్యం అందుబాటులోకి  రానుంది.  

కేంద్ర మంత్రి బండి, రాష్ట్ర మంత్రి పొన్నం చొరవ..

హుస్నాబాద్​లో 6 అంతస్థుల్లో 250 పడకల ప్రభుత్వ ఆస్పత్రికి నిర్మాణానికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి రూ.82 కోట్లు మంజూరు చేయించారు. ప్రస్తుతం దవాఖాన నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. సాధారణంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో భవనాలు ఉన్నా డాక్టర్లు ఉండరు. 

డాక్టర్లు ఉంటే పరికరాలు ఉండవు. కానీ ఇక్కడ ఆస్పత్రి భవన నిర్మాణం పూర్తికాకముందే 38 మంది స్పెషలిస్ట్ డాక్టర్లను నియమించడం వెనక మంత్రి కృషి ఎంతో ఉంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హుస్నాబాద్ ప్రభుత్వ వైద్యశాలకు రూ.1.50 కోట్ల విలువైన ఐసీయూ బెడ్స్ నుంచి ఆపరేషన్ థియేటర్ వరకు 15 రకాల అత్యాధునికి వైద్య పరికరాలను అందించారు. 

వైద్య విద్యకు కేరాఫ్..

హుస్నాబాద్ వైద్య విద్యకు కేరాఫ్​గా మారుతోంది. ఇక్కడ 50 సీట్లతో పీజీ వైద్య కళాశాల మంజూరైంది. రాబోయే రోజుల్లో నర్సింగ్ కళాశాల ఏర్పాటు కానుంది. ఫలితంగా స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయి.