ఢిల్లీలో వారానికి రెండ్రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి సోమవారం ‘మండే మెట్రో’

ఢిల్లీలో వారానికి రెండ్రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి సోమవారం ‘మండే మెట్రో’
  • సర్కారు ఆఫీసుల్లో ఏసీలు 24-26 డిగ్రీల మధ్యే ఉంచాలి
  • కరెంట్ పొదుపు కోసం మాస్టర్ స్విచ్​ల ఏర్పాటుకూ నిర్ణయం 
  • మంత్రులు, అధికారుల విదేశీ పర్యటనలపై నిషేధం 
  • కాన్వాయ్​ని 4 కార్లకు కుదించుకున్న ఢిల్లీ సీఎం రేఖా గుప్తా
  • ప్రజలు వారానికోరోజు నో వెహికల్ డే పాటించాలని పిలుపు

న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధన పొదుపు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రభుత్వ ఆఫీసుల్లో వారానికి రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయనున్నట్టు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా గురువారం ప్రకటించారు. మంత్రులు, ప్రభుత్వ అధికారులు వాహనాల వాడకాన్ని కనిష్ఠ స్థాయికి తగ్గించాలని ఆదేశించారు. ఈ నిర్ణయాలు శుక్రవారం నుంచి అమలులోకి రానున్నాయి. సీఎం తన కాన్వాయ్‌‌‌‌ని కూడా దాదాపు 60% తగ్గించి, కేవలం 4 కార్లకు పరిమితం చేశారు. 

ఇంధన పొదుపు, సమర్థవంతమైన పాలనను ప్రోత్సహించడానికి దేశ రాజధానిలో ‘మేరా భారత్, మేరా యోగ్దాన్(నా భారతదేశం, నా సహకారం)’ అనే ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్టు ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. ప్రతి సోమవారం ‘మండే మెట్రో’గా పాటించాలని, ఆ రోజున మంత్రులు, అధికారులు, ఉద్యోగులందరూ మెట్రోలో ప్రయాణించాలని పేర్కొంది. ప్రతి వారం ఒకరోజు ‘నో వెహికల్ డే’గా పాటించాలని సామాన్య ప్రజలకు కూడా ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

 రాబోయే ఆరు నెలల వరకు పెట్రోల్, డీజిల్ లేదా ఎలక్ట్రిక్ వాహనాల కొత్త కొనుగోలు ఉండదని తెలిపింది. ఉద్యోగులకు రవాణా భత్యాన్ని 10% పెంచుతామని చెప్పింది. ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన ఏ మంత్రి లేదా అధికారి వచ్చే ఏడాది వరకు ఎలాంటి అధికారిక విదేశీ పర్యటనలు చేపట్టకూడదని పేర్కొంది. ఈ చర్యలపై అవగాహన కల్పించడానికి 90 రోజుల ప్రచారం నిర్వహించనున్నట్టు వివరించింది. 

పొదుపును ప్రోత్సహించడానికి, దేశ నిర్మాణానికి సహకరించడానికి పౌరులతో ప్రతిజ్ఞ కూడా చేయిస్తామని ప్రభుత్వం తెలిపింది. అలాగే, విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోని ఏసీలను 24 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య నడిపేలా నిర్ణయించారు. విద్యుత్ వృధాను అరికట్టడానికి ప్రభుత్వ కార్యాలయాల్లో మాస్టర్ స్విచ్‌‌‌‌లు కూడా ఏర్పాటు చేయనున్నారు.