నోయిడా నుంచి ఢిల్లీ, ఫరీదాబాద్ కు వ్యాపించిన కార్మికుల ఆందోళనలు : కార్మికుల పోరాటానికి కారణం ఇదీ..!

నోయిడా నుంచి ఢిల్లీ, ఫరీదాబాద్ కు వ్యాపించిన కార్మికుల ఆందోళనలు : కార్మికుల పోరాటానికి కారణం ఇదీ..!

కార్పోరేట్ వ్యవస్థలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆదాయ మార్గాలు పెరిగాయి.. మైక్రో కంపెనీలు కూడా యూనికార్న్ కంపెనీలుగా రూపాంతరం చెందుతున్నాయి. కానీ కార్మికుల జీవితాల్లో మార్పేదీ..? పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెరుగుతున్నాయా..? కార్మికులకు భద్రత ఉందా..? అన్ని కంపెనీలు ఉద్యోగులకు ఇన్సూరెన్స్ ఇస్తున్నాయా..? ఇలాంటి ప్రశ్నలు కార్మికరంగం నుంచి ఎన్నో ఏళ్లుగా ఉత్పన్నమవుతూనే ఉన్నాయి. చట్టాలు మారుతున్నా సమస్యలు మాత్రం ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఉండటంతో.. కార్మిక వర్గం మెల్లమెల్లగా రాజుకుంటుందా అన్నట్లు.. నోయిడా కార్మిక వాడలో ఆందోళనలు మొదలయ్యాయి. 

కార్మికుల సమస్యలపై నోయిడాలో మొదలైన ఆందోళనలు మెల్లమెల్లగా విస్తరిస్తున్నాయి. ఢిల్లీ,  ఫరీదాబాద్ లో కూడా ఆందోళనలు చెలరేగడం ప్రభుత్వాన్ని టెన్షన్ కు గురిచేస్తున్న పరిస్థితి. 

నోయిడాలోని ఫేజ్-2 కార్మిక వాడ తగలబడుతోంది. గత వారం రోజులుగా కార్మిక సమస్యలు పరిష్కరించాలని చేస్తున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. కార్లు, వాహనాలు  తగలబెట్టారు. పారిశ్రామిక వాడను ధ్వంసం చేశారు. పోలీస్ వాహనాలకు నిప్పు పెట్టారు కార్మికులు. పోలీసులపైకి రాళ్లు రువ్వటంతో టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. 

  • కార్మికుల ఆందోళనలకు కారణం ఇదీ :

నోయిడాలో పారిశ్రామిక వాడ ఫేజ్ 2లో చాలా కంపెనీలు ఉన్నాయి. ఇక్కడ పని చేసే కార్మికులకు ఆయా కంపెనీలు సకాలంలో జీతాలు, వేతనాలు చెల్లించటం లేదు. నోయిడా పారిశ్రామిక వాడలో కనీస వేతనం నెలకు 13 వేల రూపాయలుగానే ఉంది. పెరిగిన ధరలతో కనీసం వేతనం పెంచాలంటూ కొన్ని రోజులుగా కార్మిక నేతలు, కార్మికులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ విషయంపై ఆయా కంపెనీలు ఎలాంటి హామీ ఇవ్వలేదు.

సరిగ్గా ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సమీపంలోని హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. హర్యానా రాష్ట్రంలో కార్మికుల కనీసం వేతనాన్ని 14 వేల నుంచి 19 వేల రూపాయలకు పెంచింది. అంటే దాదాపు 35 శాతం వేతనాలు, జీతాలు పెంచించి హర్యానా ప్రభుత్వం. 

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం కనీస వేతనం 13 వేల రూపాయలుగానే ఉంది. యూపీలో పెంచాలని చాలా రోజులుగా డిమాండ్లు ఉన్నా యూపీలోని బీజేపీ ప్రభుత్వం.. సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇదే సమయంలో పక్కనే ఉన్న హర్యానా ప్రభుత్వం కార్మికుల వేతనాలను భారీగా పెంచింది.

ఈ విషయం తెలిసిన కార్మికులు 2026, ఏప్రిల్ 13వ తేదీ ఉదయం ఒక్కసారిగా భగ్గుమన్నారు. కడుపు రగలిపోయింది. ఇన్నాళ్లుగా కంపెనీలను కోరుతున్నా పట్టించుకోలేదు.. పక్కన హర్యానా రాష్ట్రం ఒకేసారి భారీగా వేతనాలు పెంచిందన్న కోపంతో నోయిడా పారిశ్రామిక వాడల్లోని కార్మికులు రెచ్చిపోయారు. కంపెనీలపై దాడులకు తెగబడ్డారు.

కార్మికుల డిమాండ్లు:

  • వారానికి ఒక వీక్లీ ఆఫ్
  • ప్రతీ నెలా పే స్లిప్స్
  • ఇన్సూరెన్స్
  • వేధింపుల నివారణకు కమిటీ
  • చేసిన పనికి సరైన జీతం
  • బోనస్, 
  • అదనపు పనికి అదనపు జీతం (ఓటీ )


కంపెనీల్లోకి చొచ్చకెళ్లిన వర్కర్లు:

పోలీసులు హెచ్చరికలు చేసినా.. భాష్పవాయు గోళాలు ప్రయోగించినా.. కేసులు పెడతామని భయపెట్టినా కార్మికులు ఎక్కడా తగ్గడం లేదు. సోమవారం (ఏప్రిల్ 13) మదర్ సన్ కంపెనీలోకి వర్కర్లు దూసుకెళ్లారు. సీనియర్ స్టాఫ్ ను కంపెనీకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేలోపు పనులు జరగడానికి వీళ్లేదని ధర్నాకు దిగారు. 

అంతకు ముందు నాలుగో రోజు కార్మికుల ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. నోయిడా పారిశ్రామిక వాడలో ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు .దీంతో కార్మిక వాడ యుద్ధభూమిని తలపించింది. కార్మిక సంఘాలతో చర్చలు జరిపి పరిష్కరిస్తామని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.