
- ఒక్కో సర్కిల్లో వేల అప్లికేషన్లు పెండింగ్
- మ్యుటేషన్ల కోసం 20 వేల మంది ఎదురుచూపు
- అధికారులతో గొడవలకు దిగుతున్న దరఖాస్తుదారులు
- డీసీలపై హెడ్డాఫీసు, జోనల్ ఆఫీసుల్లో కంప్లయింట్స్
హైదరాబాద్, వెలుగు: బల్దియా సర్కిల్ ఆఫీసుల్లో పౌరసేవలు సరిగా అందడం లేదు. మ్యుటేషన్, ట్రేడ్ లైసెన్స్, బర్త్, డెత్ సర్టిఫికెట్లు ఇలా అన్ని రకాల సేవలను అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పటికే గ్రేటర్ పరిధిలో 20 వేల మ్యుటేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి ఆన్లైన్లో ఎంట్రీచేసిన వాటి వివరాలు మాత్రమే. మ్యానువల్‌గా ఒక్కో ఆఫీసులో అప్లికేషన్లు కుప్పలుగా పేరుకుపోయాయి. దీంతో మ్యుటేషన్ల కోసం జనాలు ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. కొన్ని చోట్ల అప్లయ్ చేసి నెలలు గడుస్తున్నా కూడా ఇవ్వకపోవడంపై అధికారులతో దరఖాస్తుదారులు గొడవలు పెట్టుకుంటున్నారు. డిప్యూటీ కమిషనర్ల వద్దకు ఎన్నిసార్లు వెళ్లి అడిగినా పని జరగకపోవడంతో హెడ్డాఫీసుకి వెళ్లి ఉన్నతాధికారులకు కంప్లయింట్ చేస్తున్నారు. మ్యుటేషన్లు అందించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఇటీవల ముషీరాబాద్ డీసీపై పలువురు హెడ్డాఫీసులో కంప్లయింట్ చేశారు. ఇంకొందరు డీసీలపై సంబంధిత జోనల్ కమిషనర్లకు కంప్లయింట్ చేస్తున్నారు. ఇంత జరిగినా సర్కిల్ ఆఫీసుల్లో మ్యుటేషన్లు మాత్రం చేయడం లేదు. మ్యుటేషన్ల సంగతి ఇలా ఉంటే బర్త్, డెత్, ట్రేడ్ లైసెన్స్‌ల కోసం బల్దియా ఆఫీసుల చుట్టూ తిరిగినా కూడా పనులు కావడం లేదని సిటీ జనం చెప్తున్నారు.
వందశాతం సిబ్బంది వస్తున్నా..
లాక్ డౌన్ కారణంగా మొన్నటి వరకు కొంద మంది సిబ్బంది మాత్రమే విధులకు హాజరయ్యారు. ఆఫీసులకు సిబ్బంది తక్కువగా వస్తున్నందున కొద్దిరోజుల తర్వాత అప్లికేషన్లను తీసుకోవాలని అధికారులు సూచించారు. ఇప్పుడు వందశాతం సిబ్బంది హాజరవుతున్న కూడా పనులు కాకపోవడంపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . కరోనా సాకుతో అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ముషీరాబాద్, గోషామహల్, బేగంపేట్ సర్కిళ్లలో వెయ్యికి పైగా, శేరిలింగంపల్లి, చందానగర్ సర్కిళ్లలో 2 వేలకు పైగా మ్యుటేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో మొత్తం 19,969 మ్యుటేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. దరఖాస్తుదారులు నెలలుగా వెయిట్ చేస్తున్నారు. కొన్ని సర్కిళ్లలో రికమెండేషన్ ఉన్నవారికి మాత్రమే పనులు జరుగుతున్నట్టు సమాచారం. సాధారణ జనాన్ని పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వస్తున్నాయి.
చర్యలకు రంగం సిద్ధం..
సర్కిల్ ఆఫీసుల్లో పనులు కావడంలేదంటూ జనం హెడ్డాఫీసుకు వస్తుండడంతో ఫిర్యాదులు వచ్చిన వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆయా ప్రాంతాల నుంచి వస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇకపై సర్కిల్ స్థాయి అధికారులు, సిబ్బంది పనిచేయకపోతే కఠినంగా చర్యలు తీసుకోనున్నారు.
ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ దృష్టికి..
చెత్త సమస్య నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కదాని గురించి సిటీజనం సోషల్ మీడియా వేదికగా మంత్రి కేటీఆర్, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొస్తున్నారు. ఓ సమస్యను చూపుతూ దీనిపై ఎన్నిసార్లు కంప్లయింట్ చేసినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ కేటీఆర్‌కు ట్వీట్ చేస్తున్నారు. దానికి పరిష్కారం చూపండంటూ సంబంధిత బల్దియా అధికారులకు మంత్రి ట్విట్టర్లోనే ఆదేశిస్తున్నారు. మంత్రి ఆదేశించే వరకు అధికారులు స్పందించడం లేదని జనం అంటున్నారు. సోషల్ మీడియా వేదికగా పనులు జరుగుతుండడంతో ఈ మధ్య కాలంలో సిటీజనం సమస్యలపై ఎక్కువగా అందులోనే పోస్టులు చేస్తున్నారు.
నెలల తరబడి తిప్పుకుంటున్నరు
సర్కిల్ ఆఫీసుల చుట్టూ ఏ పనికి వెళ్లినా నెలల తరబడి తిప్పుకోవడం అధికారులకు అలవాటుగా మారింది. వారం, పదిరోజుల్లో ఇవ్వాల్సిన సర్టిఫికెట్లకు కూడా నెలల సమయం పడుతోంది. పౌరసేవల విషయంపై ఉన్నతాధికారులు స్పందించాలి. సమస్యలు వెంటనే పరిష్కారం అయ్యేలా చూడాలి.
–జెన్నా సుధాకర్, లంగర్ హౌస్