దేశంలోని టాప్ 5 బిర్యానీ వెరైటీలు ఇవే

దేశంలోని టాప్ 5 బిర్యానీ వెరైటీలు ఇవే

జూలై 3న ప్రపంచ బిర్యానీ దినోత్సవం సందర్భంగా దేశంలో అత్యంత ప్రసిద్ధ బిర్యానీలేంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇవి ఆయా రాష్ట్రాల్లో అత్యంత ప్రసిద్ధి చెందినవే కాకుండా.. అత్యంత రుచికరమైన బిర్యానీలలో ఒకటిగా కూడా పేరు తెచ్చుకున్నాయి.

1. కాశ్మీరీ బిర్యానీ

కాశ్మీరీ బిర్యానీకి మొఘల్/మొఘల్ బిర్యానీతో సంబంధం ఉందని చాలా మంది చెబుతుంటారు. కాశ్మీరీ బిర్యానీ అనేది డ్రై ఫ్రూట్స్‌, లేత చికెన్, రైస్ తో కూడుకున్నది. కాశ్మీరీ భునా ఘోస్ట్ బిర్యానీగా ప్రసిద్ధికెక్కిన ఈ  కాశ్మీరీ బిర్యానీలో అనేక మసాలాలను కలిపి తయారు చేస్తారు.

2. కోల్‌కతా/అవధి బిర్యానీ

కోల్‌కతా బిర్యానీ కొంచెం తేలికగా ఉంటుంది, కోల్‌కతా బిర్యానీ సంతృప్తికరమైన భోజనం అని చాలా మంది అభిప్రాయం కూడా. బెంగాల్ నవాబులు సాంప్రదాయ బిర్యానీకి బెంగాలీ టచ్ ఇచ్చారని, ఫలితంగా దీనికి అవధి బిర్యానీ అని పేరొచ్చినట్టు సమాచారం. ఇందులో పెరుగు, మాంసం, బంగాళాదుంపలు, ఉడికించిన గుడ్లతో పాటు తేలికపాటి సుగంధ ద్రవ్యాలతో అన్నాన్ని వండుతారు.

3. హైదరాబాదీ బిర్యానీ

హైదరాబాదీ బిర్యానీ గురించి ఎంత చెప్పినా తక్కువే. దీన్ని ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. హైదరాబాదీ బిర్యానీ దాని విలక్షణమైన సువాసనతో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచింది. ఇందులో కేవ్డా వాటర్, రోజ్ వాటర్, కుంకుమపువ్వును జోడించడం వల్ల మరింత రుచిగా ఉంటుంది.

4. లక్నో బిర్యానీ

లక్నో కబాబ్‌ల ఎంత ఫేమస్సో.. లక్నో బిర్యానీకి కూడా అంతే పేరుంది. ఈ వంటకం పురాతన కాలంలోని నవాబులు, ప్రభువులచే ఎక్కువగా ప్రచారం చేయబడిందని చెబుతారు. దీన్ని తాజా సుగంధ ద్రవ్యాలతో కలిపి వండుతారు. మెరినేట్ చేసిన చికెన్ ను జోడించి.. వెరైటీ టెక్నిక్ తో చేసే ఈ బిర్యానీ.. రైస్ అండ్ చికెన్‌  అద్భుత రుచిని తెస్తుంది.

5. సింధీ బిర్యానీ

సింధీ బిర్యానీ.. బిర్యానీలన్నింటిలోనూ భిన్నంగా ఉంటుంది. సింధీ బిర్యానీలో మెత్తగా కోసిన మిరపకాయలు, కొత్తిమీర, తాజా పుదీనా, కాల్చిన మసాలాలను వేస్తారు. ఆకలి పుట్టించే మందపాటి మేక మాంసం అన్నంలో కలుపుతారు. డ్రై ఫ్రూట్స్, గింజలు, ఉల్లిపాయ రింగులతో ఈ డిష్ చూస్తేనే నోట్లో నీళ్లు ఊరేలా కనిపిస్తుంది.

ఇవే కాకుండా దేశంలోని పలు ప్రాంతాల్లో వెరైటీ బిర్యానీలు తమ హవాను సాగిస్తున్నాయి. పార్టీ అయినా, ఫంక్షన్ అయినా.. మరే ఇతర ఈవెంట్ అయినా చాలా మంది ఈ రోజుల్లో బిర్యానీల వైపే చూస్తున్నారు. ఈ క్రమంలో ఆన్ లైన్ లో బిర్యానీలను ఆర్డర్ చేసే వారు కూడా రోజురోజుకూ పెరిగిపోతున్నారు.