హైదరాబాద్, వెలుగు: పేద పిల్లలకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విద్యను అందించి, వారి కలలకు బలమైన పునాదులు వేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేవలం భౌతిక భవనాలను నిర్మించడం సులభమే అయినప్పటికీ, నిరుపేదల ఆశయాలకు, కలలకు పునాదులు వేయాలంటే ప్రభుత్వానికి బలమైన సంకల్పం ఉండాలన్నారు. ఆ సంకల్ప బలంతోనే తెలంగాణ వ్యాప్తంగా ఈ వినూత్న సమీకృత గురుకుల పాఠశాలలను వేగవంతంగా అందుబాటులోకి తెస్తున్నట్టు వెల్లడించారు.
రాష్ట్రంలో చేపట్టిన ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్న నేపథ్యంలో ‘ఎక్స్’ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. సమాజంలో పేరుకుపోయిన ఆర్థిక, సామాజిక అసమానతలకు ముగింపు పలకడమే కాకుండా.. కులం, మతం, ప్రాంతం, కుటుంబ నేపథ్యం అనే ఎలాంటి భేదభావాలు లేకుండా ప్రతి చిన్నారికి అంతర్జాతీయ స్థాయి నాణ్యమైన విద్యను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
విద్యా రంగంలో సరికొత్త విప్లవానికి నాంది
రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కార్పొరేట్ స్థాయిలో అత్యంత ఆధునిక వసతులతో తీర్చిదిద్దుతున్న ఈ విద్యాసంస్థలు విద్యా రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతాయని సీఎం రేవంత్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. నిరుపేద కుటుంబాల నుంచి వచ్చే ప్రతిభావంతులైన పిల్లలను రేపటి శాస్త్రవేత్తలుగా, విజనరీ లీడర్లుగా, పారిశ్రామికవేత్తలుగా, నవభారత నిర్మాతలుగా తీర్చిదిద్దే పవిత్రమైన ‘జ్ఞాన మందిరాలు’గా ఈ స్కూళ్లు నిలుస్తాయని పేర్కొన్నారు.
కేవలం ఒక తరానికే పరిమితం కాకుండా, పేద పిల్లల భవిష్యత్తుకు నిజమైన చిరునామాగా నిలుస్తూ ‘తెలంగాణ మోడల్’ విద్యా విప్లవానికి ప్రతీకగా ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు రాబోయే తరతరాల జీవన ప్రమాణాలను మార్చబోతున్నాయని వివరించారు. ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తిచేసి అందుబాటులోకి తెచ్చేందుకు అధికార యంత్రాంగం నిరంతరం శ్రమిస్తోందని వివరించారు.
