క్రికెట్‌‌కు గుడ్‌‌బై చెప్పిన అంబటి

క్రికెట్‌‌కు గుడ్‌‌బై చెప్పిన అంబటి
  • అన్ని  ఫార్మాట్ల నుంచి నిష్క్రమణ
  • వరల్డ్‌‌కప్‌‌ చాన్స్​ రాకపోవడమే కారణం?

నాలుగో నంబర్‌‌లో  నువ్వే సరైనోడివి అన్నారు. మిడిలార్డర్‌‌కు నువ్వే పెద్ద దిక్కు అన్నారు.  వరల్డ్‌‌కప్‌‌లో చోటు గ్యారంటీ అని ఆశ చూపారు. మస్తు టాలెంట్‌‌ ఉందన్నారు. అనుభవం అక్కరకొస్తుందన్నారు. కానీ, ప్రపంచకప్‌‌ జట్టుకు సెలెక్ట్‌‌ చేయకుండా పక్కన బెట్టేశారు. ఇద్దరు ఆటగాళ్లు గాయపడినా.. వారి స్థానంలో నువ్వు పనికిరావు పో అన్నారు. అప్పటిదాకా పొగిడినోళ్లే  ఇప్పుడు వద్దంటున్నారు. ఇదీ తెలుగు క్రికెటర్‌‌ అంబటి రాయుడు పరిస్థితి.  ప్రతిభ ఉన్నా  ప్రోత్సహించే వారు, అండగా నిలిచే వారు లేక.. కెరీర్‌‌ అసాంతం ఏటికి ఎదురీదిన హైదరాబాదీ తన పోరాటాన్ని ముగించాడు.  టీమిండియాకు  తాను అవసరం లేనప్పుడు తనకు ఆటే వద్దన్నాడు. వరల్డ్‌‌కప్‌‌లో ఆడాలన్న తన కల తీరదని.. ఇక పోరాడలేనని తెలిసి ఆటకు వీడ్కోలు చెప్పేశాడు. మరికొంత కాలం కొనసాగే వయసు, ఆడే సామర్థ్యం ఉన్నా ‘తిరస్కరణల’తో  విసుగు చెంది  అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించి ఆశ్చర్యపరిచాడు. టీనేజ్‌‌లో తన టాలెంట్‌‌తో  దేశం దృష్టిని ఆకర్షించి..  మేటి క్రికెటర్‌‌ అయ్యే ‘మెటీరియల్‌‌’ అనిపించుకున్న రాయుడు అంచనాలను అందుకోలేక  అర్ధంతరంగా  ఆటకు టాటా చెప్పాడు.

హైదరాబాద్‌‌, వెలుగు: ఇండియా క్రికెట్‌‌లో  ప్రతిభావంతుడైన తెలుగు ఆటగాడి అంకం ముగిసింది. వరల్డ్‌‌కప్‌‌ టీమ్‌‌లో చోటు ఆశించి భంగపడిన హైదరాబాద్‌‌ క్రికెటర్‌‌ అంబటి రాయుడు తన కెరీర్‌‌కు రిటైర్మెంట్‌‌ ప్రకటించించాడు.  ఐపీఎల్‌‌తో సహా అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్టు బీసీసీఐకి బుధవారం లేఖ రాశాడు. వీడ్కోలు నిర్ణయానికి కారణం ఏమిటో అతను చెప్పకున్నా.. వరల్డ్‌‌కప్‌‌ టీమ్‌‌లో చోటు దక్కకపోవడం వల్లే  వైదొలిగాడని అందరికీ అర్థం అవుతోంది. స్టాండ్‌‌ బై లిస్ట్‌‌లో ఉన్న తనను కాదని మయాంక్‌‌ అగర్వాల్‌‌ను జట్టులోకి తీసుకోవడంతో నొచ్చుకున్నట్టు తెలుస్తోంది. 33 ఏళ్ల  రాయుడు 2013లో జింబాబ్వేపై వన్డే అరంగేట్రం చేశాడు.  55 వన్డేల్లో 1694 రన్స్‌‌ చేశాడు.  ఈ ఏడాది మార్చి లో  ఆస్ట్రేలియాపై చివరి వన్డే ఆడాడు.

క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లు, అన్ని లెవెల్స్‌‌ నుంచి రిటైర్‌‌ కావాలని నిర్ణయించుకున్నా. ఈ సందర్భంగా బీసీసీఐకి,  నేను ప్రాతినిథ్యం వహించిన హైదరాబాద్‌‌, ఆంధ్ర, విదర్భ రాష్ట్ర సంఘాలకు, నాకు అండగా నిలిచిన ఐపీఎల్‌‌ ఫ్రాంచైజీలు ముంబై ఇండియన్స్‌‌, చెన్నై సూపర్‌‌ కింగ్స్‌‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నా. అలాగే,  నా కెప్టెన్లు ఎం.ఎస్‌‌ ధోనీ, రోహిత్‌‌ శర్మ, విరాట్‌‌ కోహ్లీకి కూడా థ్యాంక్స్‌‌. ముఖ్యంగా ఇండియా టీమ్‌‌లో కెరీర్‌‌ అసాంతం నాపై ఎనలేని నమ్మకం ఉంచిన కోహ్లీకి ప్రత్యేక కృతజ్ఞతలు.  25 సంవత్సరాల కెరీర్‌‌లో ఎదురైన ఎత్తపల్లాల నుంచి ఎన్నో నేర్చుకున్నా. ఈ ప్రయాణం చాలా అద్భుతంగా సాగింది. చివరగా నా ఫ్యామిలీకి, నా శ్రేయోభిలాషులకు కూడా కృతజ్ఞతలు    ‌‌     – రాయుడు

హైదరాబాద్‌‌ క్రికెట్‌‌లో అంబటి రాయుడు ఓ సెన్సేషన్‌‌. టీనేజ్‌‌లోనే అతని పేరు దేశం మొత్తం మార్మోగింది. ఫస్ట్‌‌క్లాస్‌‌ క్రికెట్‌‌లో అద్భుతంగా రాణించి మోస్ట్‌‌ టాలెంటెడ్‌‌ క్రికెటర్‌‌గా, ఇండియా క్రికెట్‌‌లో  తర్వాతి మేటి క్రికెటర్‌‌గా పేరు తెచ్చుకున్నాడు. కానీ,  రాజకీయ ‘క్రీడ’లో చిక్కుకొని కష్టాలు తెచ్చుకున్నాడు. తన యాటిట్యూడ్‌‌తో, దుందుడుకు ప్రవర్తనతో సాఫీగా సాగాల్సిన ప్రయాణాన్ని ముళ్ల బాటగా మార్చుకున్నాడు.  తండ్రి సాంబశివరావు స్ఫూర్తితో మూడో తరగతిలో ఉన్నప్పుడే క్రికెట్‌‌ బ్యాటు పట్టుకుని, 2001–02 సీజన్‌‌లోనే రంజీ అరంగేట్రం చేశాడు.  తర్వాతి సీజన్‌‌లో 698 రన్స్‌‌తో డొమెస్టిక్‌‌ క్రికెట్‌‌లో తన పేరు మార్మోగేలా చేసిన రాయుడు.. ఆంధ్ర జట్టుతో మ్యాచ్‌‌లో  డబుల్‌‌ సెంచరీ, సెంచరీ కొట్టిన యంగెస్ట్‌‌ క్రికెటర్‌‌గా రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత అండర్‌‌–19 వరల్డ్‌‌కప్‌‌లో ఇండియా టీమ్‌‌కు కెప్టెన్‌‌గా వ్యవహరించిన అంబటి తర్వాతి రెండు సీజన్లలో ఫామ్‌‌ కోల్పోవడంతో పాటు హెచ్‌‌సీఏ కోచ్‌‌లు, అధికారులతో గొడవపడి ‘రెబల్‌‌’ క్రికెటర్‌‌గా ముద్ర పడ్డాడు. హెచ్‌‌సీఏలో కొందరు అధికారులు తనపై కక్షగట్టారని తెలిసి 2005లో హైదరాబాద్‌‌ను వదిలి ఆంధ్ర టీమ్‌‌కు మారాడు. అదే ఏడాది ఓ రంజీ మ్యాచ్‌‌లో అంబటిపై  హైదరాబాద్‌‌ ప్లేయర్‌‌ అర్జున్‌‌ యాదవ్‌‌ వికెట్లతో దాడిచేయడం తీవ్ర దుమారం రేపింది.  ఇక 2007లో   రెబల్‌‌ లీగ్‌‌..  ఇండియన్‌‌ క్రికెట్‌‌ లీగ్‌‌ (ఐసీఎల్‌‌)లో చేరి బీసీసీఐ సస్పెన్షన్‌‌ వేటు పడడం రాయుడు కెరీర్‌‌ను అగాథంలోకి నెట్టేసింది. రెండేళ్ల తర్వాత బోర్డు నిషేధం ఎత్తి వేయడంతో ఫస్ట్‌‌క్లాస్‌‌ క్రికెట్‌‌లో రీ ఎంట్రీ ఇచ్చాడు. 2010లో ముంబై ఇండియన్స్‌‌ తరఫున ఐపీఎల్‌‌లో  రాణించిన రాయుడు  2013లో జింబాబ్వే టూర్‌‌లో ఫస్ట్‌‌ వన్డే ఆడి హాఫ్‌‌ సెంచరీ చేశాడు. 2015 వరల్డ్‌‌కప్‌‌ టీమ్‌‌కు కూడా ఎంపికైనా మ్యాచ్‌‌ ఆడే చాన్స్‌‌ దక్కించుకోలేకపోయాడు. ఆ తర్వాత జట్టుకు దూరమైనా.. 2018లో  మాజీ కెప్టెన్‌‌ ధోనీ ప్రోద్భలంతో  చెన్నై  తరఫున  ఐపీఎల్‌‌లో అదరగొట్టి నేషనల్‌‌ టీమ్‌‌లో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆసియా కప్‌‌, స్వదేశంలో వెస్టిండీస్‌‌పై రాణించడంతో నాలుగో నంబర్‌‌లో కీలకంగా మారాడు. ఈ ఏడాది ఆరంభంలో కీవీస్​పై 90 రన్స్‌‌తో ఇండియాను గెలిపించడంతో  తెలుగు క్రికెటర్‌‌పై పొగడ్తల వర్షం కురిసింది. కానీ, ఆస్ట్రేలియా సిరీస్‌‌లో 3 ఇన్నింగ్స్‌‌ల్లో వైఫల్యం అతని కెరీర్‌‌ను మళ్లీ ప్రశ్నార్థకం చేసింది.  వరల్డ్‌‌కప్‌‌కు సెలెక్ట్‌‌ కాకపోవడంతో  గుండె పగిలి వీడ్కోలు నిర్ణయం తీసుకున్నాడు.

అంబటి రాయుడు లాంటి టాలెంట్‌‌ ఉన్న ఆటగాడికి సరైన ఫ్లాట్‌‌ఫామ్‌‌ ఇవ్వని ప్రస్తుత సెలెక్షన్‌‌ కమిటీ సభ్యులందరి క్రికెటింగ్‌‌ కెరీర్‌‌ అసంపూర్తిగా ముగిసిందన్న విషయం నన్ను చాలా ఆశ్యర్యానికి గురి చేస్తోంది. ఐదుగురు సెలెక్టర్లు కలిసి రాయుడు చేసినన్ని పరుగులు చేయలేదు. అంబటిని చూస్తే బాధకలుగుతోంది. – గౌతమ్‌‌ గంభీర్‌‌

బాగా ఆడిన తర్వాత కూడా వరల్డ్‌‌కప్‌‌కు సెలెక్ట్‌‌ చేయకపోడంతో రాయుడు పడే బాధ, ఆవేదనను అర్థం చేసుకోగలను. సెకండ్‌‌ ఇన్నింగ్స్‌‌లో అతనికి సంతోషం, శాంతి చేకూరాలని కోరుకుంటున్నా.– వీవీఎస్‌‌ లక్ష్మణ్‌‌