ధోనీ ‘ఏడు’లో రావడమే తప్పు: దాదా

ధోనీ ‘ఏడు’లో రావడమే తప్పు: దాదా

మాంచెస్టర్‌‌: సెమీస్‌‌ మ్యాచ్‌‌లో ధోనీ ఏడో స్థానంలో బ్యాటింగ్‌‌కు రావడం వ్యూహాత్మక తప్పిదమని మాజీ సారథి  సౌరవ్‌‌ గంగూలీ, వీవీఎస్‌‌ లక్ష్మణ్‌‌ అన్నారు. ‘మహీ.. పాండ్యా కంటే ముందు రావాలి. ఇక్కడే వ్యూహాత్మక తప్పిదం చేశారు. కార్తీక్‌‌ కంటే ముందొచ్చినా సరిపోయేది. 2011 ఫైనల్లో అతనే ప్రమోట్‌‌ చేసుకుని నాలుగో నంబర్‌‌లో బ్యాటింగ్‌‌కు వచ్చాడు. యువీ కంటే ముందు రావడంతో ఇద్దరు కలిసి మ్యాచ్‌‌ గెలిపించారు’ అని లక్ష్మణ్‌‌ గుర్తు చేశాడు. ధోనీ ముందుగా వచ్చి ఉంటే కుర్రాళ్లు అలాంటి షాట్లు ఆడకుండా నిలువరించే వాడని దాదా చెప్పాడు.

‘వికెట్లు పడుతున్న స్టేజ్‌‌లో అనుభవజ్ఞుడి అవసరం చాలా ఉంటుంది. ఒకవేళ ధోనీ ఉండి ఉంటే పంత్‌‌ అలాంటి షాట్లు కొట్టేందుకు అంగీకరించే వాడు కాదు. ఇంగ్లండ్‌‌ పరిస్థితుల్లో ఎక్కువగా మిడాఫ్‌‌, మిడాన్‌‌లో షాట్లు కొట్టాలి. అప్పుడే సక్సెస్‌‌ అవుతారు. బ్యాటింగ్‌‌లో ప్రమోట్‌‌ అయితే కచ్చితంగా వికెట్ల పతనాన్ని ఆపేవాడు. జడేజాను ధోనీ ముందుండి నడిపించాడు. ఇద్దరి మధ్య మంచి కమ్యూనికేషన్‌‌ వల్లే ఇది సాధ్యమైంది’ అని గంగూలీ చెప్పుకొచ్చాడు.