నం.4లో ఆడేందుకు రెడీ: KL రాహుల్‌‌

నం.4లో ఆడేందుకు రెడీ: KL రాహుల్‌‌

న్యూఢిల్లీ: కీలకమైన నాలుగో నంబర్‌‌లో బ్యాటింగ్‌‌ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రిజర్వ్‌‌ ఓపెనర్‌‌ కేఎల్‌‌ రాహుల్‌‌ సంకేతాలిచ్చాడు. జట్టు కోసం ఏ స్థానంలోనైనా ఆడుతానని స్పష్టం చేశాడు. ‘సెలెక్టర్లు చాలా స్పష్టతతో జట్టును ఎంపిక చేశారు. నేను టీమిండియాలో భాగం. మేనేజ్‌‌మెంట్‌‌ కోరుకుంటే ఎక్కడైనా ఆడేందుకు సిద్ధంగా ఉన్నా. అది నాలుగు కావొచ్చు… మరేదైనా కావొచ్చు’ అని రాహుల్‌‌ పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌‌లో వాతావరణ పరిస్థితులను బట్టి తుది జట్టు కూర్పు ఉంటుందని ఇప్పటికే చీఫ్‌‌ కోచ్‌‌ రవిశాస్త్రి స్పష్టత ఇచ్చాడు. దీంతో నాలుగో నంబర్‌‌లో విజయ్‌‌ శంకర్‌‌ లేదా రాహుల్‌‌లో ఎవర్ని ఆడిస్తారన్న దానిపై సందిగ్ధత నెలకొంది. టీవీ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాత రాహుల్‌‌… ఆసీస్‌‌తో టీ20 సిరీస్‌‌లో బరిలో దిగాడు. వరుసగా 50, 47 పరుగులు చేసి కాన్ఫిడెన్స్‌‌ను అందిపుచుకున్నాడు. అదే ఫామ్‌‌ను ఐపీఎల్‌‌లోనూ చూపెడుతూ 53.90 సగటుతో 593 పరుగులు సాధించాడు.

అయితే ఫామ్‌‌ అనేది ఓవర్‌‌రేటెడ్‌‌ పదమని రాహుల్‌‌ అన్నాడు. ‘గత రెండు నెలలుగా నా బ్యాటింగ్‌‌ బాగుంది. ఇంగ్లండ్‌‌ లయన్స్‌‌తో సిరీస్‌‌ ఆడటం వలన నా నైపుణ్యాన్ని మెరుగుపర్చుకున్నా. ఆసీస్‌‌తో టీ20, ఐపీఎల్‌‌లోనూ మెరుగైన ప్రదర్శన చేశా. ఇప్పుడు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉన్నా’ అని రాహుల్‌‌ వెల్లడించాడు. ఆసీస్‌‌లో రాణించకపోయినందుకు కాస్త నిరాశగా ఉన్నా.. తన ప్రతిభలో ఎలాంటి సమస్య లేదన్న వాస్తవాన్ని తెలుసుకున్నానని చెప్పాడు.  ‘నా టెక్నిక్‌‌ను పెద్దగా మార్చుకోలేదు. సాంకేతికంగా నా బ్యాటింగ్‌‌ సింపుల్‌‌గా ఉండాలని ప్రయత్నించా. బంతిని బాగా బాదితే టెక్నిక్‌‌, ఫామ్‌‌ బాగుందని అనుకుంటారు. ఇంగ్లండ్‌‌లో నా నుంచి ఏం ఆశిస్తున్నారో తెలుసు. గతేడాది ఇదే సమయంలో అక్కడ పర్యటించాం. కాబట్టి వాతావరణ పరిస్థితులపై మంచి అవగాహన ఉంది.   ప్రతి మ్యాచ్‌‌ను కొత్తగా మొదలుపెట్టాల్సిందే. దీని కోసం మేం బాగా సన్నద్ధమయ్యాం. టీ20ల నుంచి వన్డేలకు మారడం పెద్ద సమస్య కాదు. చిన్న చిన్న మార్పులతో పరిస్థితులకు తగ్గట్టుగా ఆడితే సరిపోతుంది’ అని ఈ రాహుల్​ చెప్పుకొచ్చాడు.