హ్యాపీనెస్​ ఇండెక్స్​లో తొలి 10 దేశాలు ఇవే

హ్యాపీనెస్​ ఇండెక్స్​లో తొలి 10 దేశాలు ఇవే

ప్రపంచ దేశాల్లో ప్రజల ఆనందమయ జీవితాలను శాస్త్రీయంగా విశ్లేషించిన ‘యూయన్‌‌ సస్టెయినబుల్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ సొల్యూషన్స్‌‌ నెట్‌‌వర్క్‌‌)’ 11వ నివేదిక ఆధారంగా ‘ప్రపంచ సంతోష సూచిక-2023’ జాబితాను తాజాగా విడుదల చేసింది. 2012 నుంచి ప్రతి ఏటా విడుదల చేస్తున్న ప్రపంచ సంతోష సూచిక జాబితా నిర్ణయించడానికి అవినీతి అవగాహన, దాతృత్వ గుణం, జీవిత ఎంపికల్లో స్వేచ్ఛ, ఆరోగ్య సగటు ఆయుర్దాయం, సామాజిక మద్దతు, తలసరి జీడిపీ, అన్యాయ అక్రమాల వేదన అనబడే పలు అంశాలను తీసుకొని “గ్యాలప్‌‌ వరల్డ్‌‌ పోల్‌‌” ప్రశ్నావళితో ప్రపంచ ఆనందమయ సూచికను నిర్ణయించడం జరిగింది. 

హ్యాపీనెస్​ ఇండెక్స్​లో తొలి 10 దేశాలు..

అత్యంత ఆనందమయ దేశంగా గత ఆరు ఏండ్లుగా ఫిన్‌‌లాండ్‌‌ తొలి స్థానంలో నిలవడం గమనించారు. తరువాత స్థానాల్లో డెన్మార్క్‌‌, ఐస్‌‌లాండ్, ఇజ్రాయిల్, నెథర్‌‌లాండ్, స్వీడెన్‌‌, నార్వే, స్విట్జర్‌‌లాండ్‌‌, లక్సెన్‌‌బర్గ్‌‌, న్యూజిలాండ్ దేశాలు తొలి 10 స్థానాల్లో నిలిచాయి. వీటితో పాటు ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్‌‌, అమెరికా, యూకె  నిలిచాయి. యుద్ధంతో సతమతమవుతున్న రష్యా(70), ఉక్రెయిన్‌‌(92) దేశాలు కూడా ఇండియా కన్నా మెరుగైన స్థానాల్లో నిలవడం జరిగింది. అత్యంత అసంతృప్త లేదా సంతోషం కరువైన దేశాలుగా అఫ్ఘానిస్థాన్(137)‌‌, లెబనాన్(136), జింబాబ్వే(135), కాంగో(134) దేశాలు జాబితాలో చిట్ట చివరన ఉన్నాయి. 

ఇండియాకు 126వ స్థానం

ఇండియాకు 126వ స్థానం లభించడం కొంత విచారాన్ని కలిగిస్తున్నది.  గత ఏడాది నివేదికలో 136వ స్థానంతో పోల్చితే నేడు ఇండియాకు 126వ స్థానం దక్కడం కొంత ఊరటను కలిగిస్తున్నది. పెరుగుతున్న పట్టణీకరణ, అధిక నగర జనసాంద్రత, ఆదాయాలు క్షీణించడం, నిరుద్యోగం పెరగడం, అవినీతి విచ్చలవిడిగా పెరగడం, వైద్య ఖర్చులు అధికం కావడం, మహిళల అభద్రత, పర్యావరణ కాలుష్యం, మానసిక క్షేమం తరగడం లాంటి కారణాలతో భారతీయుల సంతోషం హరించుకుపోతున్నట్లు విశ్లేషించారు. 

కరోనా అనంతరం పెరిగిన దానగుణం

కరోనా మహమ్మారికి ముందుతో పోల్చితే 2020-–22 మధ్య మూడేళ్లలో ఆశావహ దృక్పథం, దాతృత్వ గుణం ప్రజల్లో 25 శాతం పెరిగినట్లు తేల్చారు. అపరిచితులకు చేయూతనివ్వడం, ఇరుగుపొరుగుకు సహాయం చేయడం లాంటి అంశాల్లో మానవాళికి కరోనా విపత్తు మానవీయ పాఠం, నిలకడలను నేర్పిందని వివరించబడింది. కోవిడ్‌‌-19 విజృంభణతో డబ్బుతో ప్రాణాలు కాపాడుకోలేమని, ఆసుపత్రిలో బెడ్‌‌ దొరక్క మరణాన్ని పొందారని మనకు తెలిసింది. ఐరాసకు చెందిన యస్‌‌డియస్‌‌యన్‌‌ నివేదిక ఎలా ఉన్నా భారత ప్రజలు మానవీయత పండిన మూర్తులని, దానగుణంలో కర్ణుడు మనకు ఆదర్శమని, నైతిక సమాజ నిర్మాణం మనకు ప్రత్యేకమని, కుటుంబ విలువలు మన పునాదులని, సామాజిక పరస్పర అవగాహన మన ప్రత్యేకతని, న్యాయమే మన ఊపిరని నిరూపిస్తూ రాబోయే రోజుల్లో యువ భారతం 
ప్రపంచ దేశాలకు గురుస్థానంలో ఉండాలని కోరుకుందాం.

నివేదికను ఖండించిన ఇండియా

ప్రపంచ సంతోష సూచిక-2023 నివేదికలో ఇండియాకు 126వ స్థానంగా అసంతృప్తి అధికంగా, ఆనందమేలేని దేశంగా చూపడాన్ని భారత ప్రభుత్వం ఖండించింది. భారత విదేశాంగ మంత్రి యస్‌‌ జయశంకర్‌‌ నివేదిక పట్ల మాట్లాడుతూ ఈ నివేదిక రూపొందించడానికి ఎంపిక చేసుకున్న ప్రశ్నావళి పశ్చిమ దేశాల జీవన విధానాలకు మాత్రమే అనుకూలంగా ఉందని, భారత దేశంలోని హైదరాబాదు, బెంగళూరు, చెన్నై లాంటి మహానగరాలను పరిశీలిస్తే ప్రజలు అనుభవిస్తున్న స్వేచ్ఛ, సంతోషకర జీవన విధానం అర్థం అవుతాయని మంత్రి తెలిపారు. కుటుంబ వ్యవస్థ, ఉమ్మడి కుటుంబాలు, తల్లితండ్రులతో పిల్లల అనుబంధాలు, కుటుంబ సభ్యులు అందరు కలిసి భోజనం చేయడం, కష్టసుఖాలను పంచుకోవడం, తల్లితండ్రుల అంగీకారంతో పిల్లలు వివాహాలు చేసుకోవడం, మానవీయ విలువలు ప్రదర్శించడం, ఉన్న దానితో ఆనందంగా జీవించడం లాంటి అంశాలను ప్రశ్నావళిలో చేర్చితే పశ్చిమ దేశాల కన్నా ఇండియా ఆనందంలో ఎంతో ముందుంటుందని తెలిపారు. 


- డా. బుర్ర మధుసూదన్ రెడ్డి