ఫిన్లాండ్​.. ఆనందానికి అడ్డా!

ఫిన్లాండ్​.. ఆనందానికి అడ్డా!
  • యూఎన్​ ‘హ్యాపీనెస్​ రిపోర్ట్​’లో ఐదోసారీ ఫస్ట్​ ప్లేస్
  • మన దేశానికి 136వ ర్యాంకు

న్యూయార్క్​: ఆనందం విషయంలో ఫిన్లాండ్​ ‘తగ్గేదేలే’ అంటోంది. సంతోషానికి తమ గడ్డనే అడ్డా అంటోంది. ఆనందానికి తానే రారాజునని ఐదోసారీ నిరూపించింది. శుక్రవారం ఐక్యరాజ్యసమితి సస్టెయినబుల్​ డెవలప్​మెంట్​ సొల్యూషన్స్​ నెట్​వర్క్​ విడుదల చేసిన 146 దేశాల ‘హ్యాపీనెస్​ రిపోర్ట్​’లో ఫస్ట్​ ప్లేస్​ను తనవద్దే పదిలపరచుకుంది. ఈ జాబితాలో మన దేశం 136వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. అంతకుముందు నివేదికలో 144వ స్థానంలో (156దేశాలతో జాబితా) ఉన్న మన దేశం ఇప్పుడు.. 8 స్థానాలు పైకి ఎగబాకింది. 
విషాద దేశం.. అఫ్గానిస్తాన్
నాటో దేశాలు ఖాళీ చేసి వెళ్లిపోవడంతో తాలిబన్ల రాజ్యం వచ్చిన అఫ్గానిస్తాన్​.. చివరి స్థానంలో నిలిచింది. తద్వారా విషాద దేశంగా అట్టడుగుకు పరిమితమైంది. ప్రస్తుతం యుద్ధంతో అల్లాడిపోతున్న ఉక్రెయిన్​98వ ర్యాంకులో ఉండగా.. ఆ దేశంపై దండెత్తిన రష్యా 80వ స్థానంలో ఉంది. అయితే, ఉక్రెయిన్​పై రష్యా యుద్ధం మొదలుపెట్టడానికి ముందే ఈ లిస్టును యూఎన్​ సిద్ధం చేసింది. తాజాగా విడుదల చేసింది. జీవన ప్రమాణాలు, జీడీపీ, ఆయుష్షు తదితర విషయాల ఆధారంగా యూఎన్​ ఈ రిపోర్టును తయారు చేసింది. ఇంతకుముందు టాప్​ 10లో ఆస్ట్రియా.. ఇప్పుడు ఒక ర్యాంకు దిగజారింది. అగ్రరాజ్యంగా అన్ని దేశాలను శాసిస్తున్న అమెరికా 16వ స్థానంలో నిలిచింది. లెబనాన్​, జింబాబ్వే, రవాండ, బోట్స్​వానాలు అడుగున నిలిచాయి.

ఇవీ టాప్​ 20​ ఆనంద దేశాలు

ఫిన్లాండ్​, డెన్మార్క్​, ఐస్​లాండ్​, స్విట్జర్లాండ్​, ద నెదర్లాండ్స్​, లగ్జెంబర్గ్​, స్వీడన్​,  నార్వే, ఇజ్రాయెల్, న్యూజిలాండ్​, ఆస్ట్రియా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జర్మనీ, కెనడా, అమెరికా, బ్రిటన్​, చెక్​ రిపబ్లిక్​, బెల్జియం, ఫ్రాన్స్​.