
లండన్: వరల్డ్ నంబర్ వన్ అరీనా సబలెంకా వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. మెన్స్ సింగిల్స్‌లో టేలర్ ఫ్రిట్జ్ కూడా ముందంజ వేశాడు. ఆదివారం జరిగిన విమెన్స్ సింగిల్స్ ప్రి క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సబలెంకా (బెలారస్) 6–-4, 7–-6 (7/4)తో వరుస సెట్లలో 24వ సీడ్ ఎలీస్ మెర్టెన్స్ (బెల్జియం )ను ఓడించింది. తొలి సెట్ ఈజీగా నెగ్గిన టాప్ సీడ్ ప్లేయర్‌కు రెండో సెట్‌లో మెర్టెన్స్ గట్టి పోటీ ఇచ్చింది.
అయితే టై బ్రేక్‌లో అమె పని పట్టిన సబలెంక వింబుల్డన్‌లో మూడోసారి క్వార్టర్ ఫైనల్లో అడుగు పెట్టింది. ఈ మ్యాచ్‌లో ఆరు ఏస్‌లు కొట్టిన అరీనా మూడు బ్రేక్ పాయింట్స్ సాధించింది. మెర్టెన్స్‌తో తన ముఖాముఖి రికార్డును 11–2కు పెంచుకుంది. ఇతర మ్యాచ్‌ల్లో అనస్తాసియా పవ్లుచెంకోవా (రష్యా) 7–-6 (7/3), 6–-4తో బ్రిటన్‌కు చెందిన సోనాయ్ కార్టల్‌ను, లారా సీగెమండ్ (జర్మనీ) 6–3, 6–2తో సోలానా సియెరా (అర్జెంటీనా)ను ఓడించారు.
మెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 6–-1, 3–-0తో ఆధిక్యంలో ఉన్న దశలో ప్రత్యర్థి జోర్డాన్ థాంప్సన్ (ఆస్ట్రేలియా) గాయం కారణంగా మ్యాచ్ మధ్యలోనే వైదొలగాడు. దాంతో ఫ్రిట్జ్ ముందంజ వేశాడు. మరో మ్యాచ్‌లో 17వ సీడ్ కారెన్ కచనోవ్ (రష్యా) 6–4, 6–2, 6–3తో కమిల్ ముజ్‌చర్జాక్ (పోలాండ్)ను ఓడించి క్వార్టర్స్ చేరాడు.